దేశవ్యాప్తంగా విస్తరించిన బలమైన పార్టీ బిజెపి

దేశవ్యాప్తంగా విస్తరించిన బలమైన పార్టీ బిజెపి
 
భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైన పార్టీగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించి తూర్పు, పడమర, దక్షిణ భారతదేశంలో కూడా బలమైన స్థానం సంపాదించిందని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమంలో మాట్లాడుతూ కర్ణాటకలో గతంలో బిజెపి అధికారంలోకి వచ్చిన విషయం గుర్తుచేస్తూ, కేరళలో కూడా తొలిసారిగా బిజెపి ఎంపీ గెలవడం పార్టీ విస్తరణకు నిదర్శనమని చెప్పారు.

కేరళలో కమ్యూనిస్టు హింస వల్ల బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై ఎన్నో దాడులు జరిగాయని, పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్న కార్యకర్తను విద్యార్థుల ముందే హత్య చేసిన ఘటనలు, కుటుంబ సభ్యుల ఎదుటే కార్యకర్తలను చంపిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ కార్యకర్తలు వెనక్కి తగ్గకుండా పోరాడి పార్టీని బలపరిచారని చెప్పారు. కేరళలో త్రివేండ్రం సహా పలు స్థానిక సంస్థల్లో బీజేపీ బలపడటం పార్టీ ఎదుగుదలకు ఉదాహరణ అని తెలిపారు.

దేశవ్యాప్తంగా బిజెపి ఎదుగుదల ఒక వ్యక్తి వల్ల కాదు, కోట్లాది కార్యకర్తల త్యాగాల ఫలితమని చెప్పారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక రాష్ట్రాల్లో కార్యకర్తలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని తెలిపారు. గుజరాత్‌లో అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం టాడా చట్టాన్ని ఉపయోగించి బిజెపి కార్యకర్తలను ఇబ్బంది పెట్టిందని, బీహార్‌లో కూడా అనేక అణచివేతలు జరిగాయని రావు గుర్తు చేశారు.

దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి పరిషత్, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో జైలులో నిర్బంధించినప్పటికీ ఉద్యమాలు ఆగలేదని తెలిపారు. ఆ త్యాగాల పునాది మీదనే ఈరోజు బిజెపి కేంద్రంలో అధికారంలో ఉందని, అనేక రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని సాధించిందని చెప్పారు.  అదే త్యాగస్ఫూర్తి, అదే కమిట్‌మెంట్‌తో పని చేస్తే తెలంగాణలో కూడా బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అనేక చోట్ల బీజేపీ రెండో స్థానంలో నిలిచి ప్రజల్లో మరింత విశ్వాసాన్ని సాధించిందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి కార్యకర్త ప్రజల దాకా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. దేశవ్యాప్తంగా ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోందని, కొత్త రైల్వే స్టేషన్లు నిర్మాణం, వందే భారత్ వంటి వేగవంతమైన రైలు సేవలు అందుబాటులోకి రావడం కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి దిశలో తీసుకున్న చర్యలేనని తెలిపారు.