‘ఇస్లామిక్ నాటో’కు పాక్, సౌదీ అడుగులు

‘ఇస్లామిక్ నాటో’కు పాక్, సౌదీ అడుగులు

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తీవ్రంగా మారుతున్న సమయంలో, ఇరాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ సయ్యద్ ఆసిమ్ మునీర్ సౌదీ అరేబియాకు వెళ్లి అక్కడి రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్‌తో సమావేశంతో కావడంతో ‘ఇస్లామిక్ నాటో’ కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయా? అన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తర్వాత సౌదీ అరేబియాపై డ్రోన్లు, క్షిపణి దాడులు చేసింది. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో కొత్త భద్రతా సమీకరణాలకు దారితీస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో చేసిన ప్రకటనలో, మునీర్‌తో జరిగిన సమావేశంలో ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై విస్తృతంగా చర్చించామని తెలిపారు. 

ముఖ్యంగా ఇరాన్ నుంచి జరుగుతున్న డ్రోన్, క్షిపణి దాడులు ప్రాంతీయ స్థిరత్వానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఆ దాడులను ఆపేందుకు రెండు దేశాలు కలిసి ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చన్న అంశంపై చర్చించినట్లు ఆయన వెల్లడించారు. ప్రాంతీయ భద్రతకు భంగం కలిగించే చర్యలను నివారించేందుకు ఇరాన్ వివేకంతో వ్యవహరించాలని ఆశిస్తున్నామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 

పాకిస్థాన్ సైన్యం విడుదల చేసిన ప్రకటనలో కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. ఇరాన్ నుంచి వస్తున్న డ్రోన్, క్షిపణి దాడుల వల్ల ఏర్పడిన భద్రతా పరిస్థితులను ఇరు దేశాల ప్రతినిధులు సమీక్షించినట్లు తెలిపింది. పాకిస్థాన్, సౌదీ అరేబియా గత ఏడాది ఒక వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 

ఈ ఒప్పందం ప్రకారం మూడో దేశం నుంచి దాడి జరిగితే అది రెండు దేశాలపై దాడిగా పరిగణించి ఒకరికొకరు రక్షణ కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఒప్పందం తొలి పరీక్షను ఎదుర్కొంటున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు సౌదీపై ఇరాన్ దాడులు చేస్తోంది. మరోవైపు అదే సమయంలో అఫ్గానిస్థాన్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. 

ఈ రెండింటిలో ఏ రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం మొదలైనా పరస్పరం సైనిక మద్దతును ఇస్తాయా? అనే ప్రశ్నలు అంతర్జాతీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి పాకిస్థాన్, సౌదీ అరేబియా నేతలు తరచుగా సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. 

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇప్పటికే సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అదే సమయంలో పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా సౌదీ నేతలతో పలుమార్లు చర్చలు జరిపారు. ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రితో కూడా మాట్లాడి సౌదీ అరేబియాపై దాడులు చేయవద్దని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.