ఏపీలో కూటమి ఐక్యతను కాపాడుకోవాలి

ఏపీలో కూటమి ఐక్యతను కాపాడుకోవాలి
20 నెలలుగా కొనసాగుతున్న కూటమి ఐక్యతను కాపాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపిచ్చారు. కిందిస్థాయిలోనూ ఇదే ఐక్యత ఉండాలని ఆకాంక్షించారు. జిల్లా స్థాయిలో 3 పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తూ, అందరం ఒక్కటే అనే భావనతో మెలిగేలా చూసుకోవాలి కోరారు. ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశంలో శాసనసభ్యులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

సభలో ఆవు కథలు చెప్పడం మానేసి, విషయ అవగాహనతో రావాలని ఆయన నిర్దేశించారు. ఎవరేం మాట్లాడుతున్నారో అన్నీ నమోదు చేసుకుంటానని చెబుతూ 3 నుంచి 7నిమిషాల్లో స్పష్టంగా విషయం చెప్పాలని మార్గనిర్దేశం చేశారు. తనకు క్వాంటం పరిజ్ఞానం లేకపోయినా, దాని ప్రయోజనాలు బాగా తెలుసని, సాంకేతికత మార్పులను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలని సభ్యులకు సూచించారు. 

రాష్ట్రంలో 1.60 లక్షల మంది క్వాంటం కోర్సులకు దరఖాస్తు చేసుకోవడం కొత్త టెక్నాలజీపై యువత ఆసక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. మద్రాస్ ఐఐటీలో క్వాంటం కోర్సుకు 2.5 లక్షల మంది దరఖాస్తులు వస్తే అందులో లక్షా 10 వేల మనవాళ్లవే ఉన్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక లక్ష కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారుల పనులు, రూ.90 వేల కోట్ల రైల్వే పనులు జరుగుతున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. 

కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలన్నింటినీ రాష్ట్రం అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.450 కోట్ల నష్టంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నింటినీ అధిగమించి రూ.54 కోట్ల లాభల్లోకి రావడం శుభపరిణామం అంటూ సంతోషం ప్రకటించారు. అన్ని మతాలను గౌరవించాలని, ఎవరి విశ్వాసాలను దెబ్బతీయకూడదని సీఎం స్పష్టం చేశారు. 

జగన్ మోహన్ రెడ్డికి  మతాలపై గౌరవం లేనందునే వైఎస్సార్సీపీ హయాంలో రామతీర్థం సహా అనేక ఆలయాలపై దాడులు జరిగిన విషయం ముఖ్యమంత్రి ప్రస్తావించారు. తిరుమల సహా వీలైన ప్రతి ఆలయంలో ప్రసాదాలను కల్తీ చేశారని మండిపడ్డారు. విశ్వాసం పెంచుకుని శాశ్వతంగా రాజకీయాల్లో ఉండేలా కూటమి ఎమ్మెల్యేలు మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. 

మనం పూర్తిగా కోలుకున్నాం అనుకోవద్దు. కానీ వ్యవస్థలను గాడిన పెట్టామని తెలిపారు. దీన్ని అంతా సానుకూలంగా తీసుకుని కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గాల్లో పెండింగ్ పనులు గుర్తించి తనకు ఇస్తే ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేద్దామని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతో లేకపోతే ఫలితాలు రావని స్పష్టం చేశారు.

వైఎస్సార్సీపీ 5 ఏళ్ల విధ్వంసాన్ని అధిగమించి రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకువెళ్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ స్పష్టం చేశారు. 20 నెలల్లో చాలా కష్టపడి ఐక్యంగా పనిచేశామని గుర్తుచేశారు. 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని, ఐక్యంగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.