దాదాపు నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలికే దిశగా వచ్చే వారం ఫిబ్రవరి 4, 5 తేదీల్లో అబుదాబి వేదికగా రష్యా, ఉక్రెయిన్, అమెరికా దేశాల మధ్య త్రైపాక్షిక శాంతి చర్చలు జరగబోతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అయితే ఒకవైపు చర్చల మాటలు వినిపిస్తున్నా, మరోవైపు రష్యా తన యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది.
రష్యా ప్రయోగించిన డ్రోన్లు ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ డిటిఈకె కంపెనీ బస్సును ద్నిప్రో నగరం వద్ద ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న 15మంది గని కార్మికులు మృత్యువాత పడ్డారు. మృతులంతా గని కార్మికులే. విధులు ముగించుకొని తిరిగి వెళ్తుండగా తమ ఉద్యోగులపై దాడి జరిగిందని, ఇది అతిపెద్ద ఉగ్రవాద దాడి అంటూ ఆ కంపెనీ ఆరోపణలు చేసింది.
ఉక్రెయిన్‌లోని జపోరిజియాలో ఉన్న ఒక ప్రసూతి ఆసుపత్రిపై రష్యా డ్రోన్లతో విరుచుకుపడటంతో ఆసుపత్రిలో ఉన్న ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. యుద్ధంలో ఆసుపత్రులపై దాడులు చేయడం యుద్ధ నేరమని ఉక్రెయిన్ మండిపడుతోంది. శాంతి చర్చల గురించి జెలెన్‌స్కీ తన టెలిగ్రామ్ ఛానల్‌లో వివరాలు వెల్లడించారు.
“మా చర్చల బృందం నుంచి ఇప్పుడే నివేదిక వచ్చింది. తదుపరి విడత త్రైపాక్షిక సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో అబుదాబిలో ఈ చర్చలు జరుగుతాయి. యుద్ధానికి ఒక గౌరవప్రదమైన, నిజమైన ముగింపు పలకడమే మా లక్ష్యం. అర్ధవంతమైన చర్చలకు ఉక్రెయిన్ పూర్తిగా సిద్ధంగా ఉంది” అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.
ఈ చర్చల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కృషి ఉంది. శనివారం మధ్యాహ్నం రష్యాకు చెందిన అగ్రశ్రేణి దౌత్యవేత్త కిరిల్ దిమిత్రీవ్, ఫ్లోరిడాలో అమెరికా శాంతి బృందంతో భేటీ అయ్యారు. ఆ సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని ఆయన వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక యుద్ధాన్ని ఆపడానికి ఏడాదిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే, ఈ చర్చలపై అమెరికా, రష్యా అధికారులు అధికారికంగా ఇంకా స్పందించలేదు. శాంతి ఒప్పందానికి ఇరు దేశాలు సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, అసలు సమస్య భూభాగం దగ్గరే ఉంది. రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను వదులుకోవాలా? లేదా ఉంచుకోవాలా? అనేదే ప్రధాన వివాదం.
ముఖ్యంగా ఉక్రెయిన్ పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్ విషయంలో పీటముడి పడింది. రష్యా ఇంకా పూర్తిగా ఆక్రమించని ప్రాంతాలను కూడా తమకు ఇవ్వాలని కోరుతుంది. దీనికి ఉక్రెయిన్ అంగీకరించడం లేదు. ఆదివారం ఉదయం దక్షిణ ఉక్రెయిన్‌లోని జపోరిజియాలో రష్యా ప్రయోగించిన అటాక్ డ్రోన్లు నేరుగా ప్రసూతి ఆసుపత్రిని ఢీకొట్టాయి.

More Stories
11వ శతాబ్దం నాటి చోళుల రాగి పలకలు భారత్ కు అప్పగింత
బీజేపీ ఎన్నికల విజయాలపై అమెరికాలో సంబరాలు
ఒలింపిక్స్, తయారీ కేంద్రం, గ్రీన్ హబ్, ప్రపంచ ఆర్థిక శక్తి!