బంగ్లాదేశ్‌కు ఇచ్చే నిధుల్లో సగం కోత

బంగ్లాదేశ్‌కు ఇచ్చే నిధుల్లో సగం కోత
ప్రతిసారీ కేంద్ర బడ్జెట్ లో మన రాష్ట్రాలతో పాటు మన దేశంతో సన్నిహితంగా ఉంటున్న దేశాలకూ వ్యూహాత్మకంగా నిధులు కేటాయిస్తుంటారు. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. భారత విదేశాంగ విధానంలో భాగంగా ఈ కేటాయింపులు చేస్తుంటారు. అయితే ఈసారి మారిన పరిస్ధితుల్లో పొరుగుదేశం బంగ్లాదేశ్ కు భారత్ షాకిచ్చింది.
 
ఈ ఏడాది బడ్జెట్‌లోనూ భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు మొత్తం రూ.5,683 కోట్లు కేటాయించింది. అయితే, గత ఏడాదిన్నరగా దౌత్య సంబంధాలు క్షీణిస్తున్న బంగ్లాదేశ్‌కు మాత్రం కిందటి బడ్జెట్ (రూ.120 కోట్లు)తో పోల్చితే సగానికి సగం కోత విధించింది. కేవలం రూ.60 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది. 
 
ఆగస్టు 2024లో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆ దేశంలో మైనార్టీలు ముఖ్యంగా హిందువులపై హింస, పాకిస్థాన్‌‌కు దగ్గరవుతుండటంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది.  బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలినప్పటి నుంచి అక్కడి తాత్కాలిక ప్రభుత్వం హయాంలో హిందువులతో సహా మైనారిటీలపై దాడులు, హత్యలు నిరాటంకంగా జరుగుతున్నాయి. దీనిపై భారత్ ఆందోళనలను బంగ్లా పాలకులు బేఖాతరు చేస్తున్నారు.
ఈసారి బడ్జెట్‌లో అత్యధికంగా భూటాన్‌కు రూ.2,288 కోట్ల ఆర్థిక సాయాన్ని కేంద్రం కేటాయించింది. ఇది గతం కంటే 6 శాతం ఎక్కువ. నేపాల్‌కు రూ.800 కోట్లు, శ్రీలంకకు రూ.400 కోట్లు, మయన్మార్‌కు రూ.300 కోట్లు కేటాయించింది. మాల్దీవులు, మారిషస్‌కు చెరో రూ.550 కోట్లు, అఫ్గానిస్థాన్‌కు రూ.150 కోట్లు, మంగోలియాకు రూ.25 కోట్లు, ఆఫ్రికన్ దేశాలకు రూ.225 కోట్లు, సీషెల్స్‌కు రూ.19 కోట్లు సాయం అందించనుంది.

మరోవైపు భారత్ తో సుదీర్ఘ కాలంగా సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న మిత్రదేశం ఇరాన్ కు కూడా ఈసారి బడ్జెట్ లో కేంద్రం షాకిచ్చింది. గతానికి భిన్నంగా, భారత్ తన కేంద్ర బడ్జెట్‌లో చబహార్ పోర్టు ప్రాజెక్టుకు ఎటువంటి నిధులను కేటాయించలేదు. అమెరికా ఇరాన్‌పై విధించిన తాజా ఆర్థిక ఆంక్షలకు వ్యూహాత్మక ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
వాస్తవానికి చబహార్ పోర్టు అభివృద్ధిలో భారతదేశం ప్రధాన భాగస్వామిగా ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో అమెరికా ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు విధించింది. అయితే చబహార్ పోర్ట్ ప్రాజెక్ట్‌పై చర్యల నుండి భారత్ కు మాత్రం 6 నెలల మినహాయింపు ఇచ్చింది. ఇది ఏప్రిల్ 26న ముగుస్తుంది. దీంతో ఈసారి బడ్జెట్ లో ఈ పోర్టుకు నిధులు ఇవ్వలేదు.