ఎన్నార్టీలను పారిశ్రామిక వేత్తలుగా చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిస్తూ రూ. 50 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జ్యూరిచ్ లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొంటూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నుంచి ప్రభుత్వం తరపున సహకరించి, మార్గదర్శనం చేస్తామని తెలిపారు.
కొంచెం కొత్త తరహాలో ఆలోచన చేస్తే పారిశ్రామిక వేత్తలుగా రాణించగలరని చెబుతూ వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారిని కో-ఆర్డినేట్ చేసి, వారిని అభివృద్ధి చేసేలా, పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా లోకేష్, రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ వంటి వారు బాధ్యత తీసుకోవాలని కోరారు. ఏపీలో వ్యాపారాలకు, పరిశ్రమలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెబుతూ వ్యాపార, వాణిజ్య రంగంలోకి రావాలనుకున్న ఎన్నార్టీలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. విదేశాల్లోను వ్యాపారాలు చేసుకుంటామంటే చేయండని, ఏపీలో పెట్టుబడులు పెడతామన్నా స్వాగతిస్తామని తెలిపారు.
“చదువు కోవాలని అనుకునే ప్రతి ఒక్కరినీ చదివిస్తాం. ప్రపంచ వ్యాప్తంగా మంచి యూనివర్శిటీలు ఎక్కడున్నా విద్యార్థులకు అవకాశాలు అందేలా చేస్తాం. 4 శాతం వడ్డీతో రుణాలు ఇప్పించి విదేశీ విద్య అందించేలా మేం చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు ఇస్తాం” అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. “ఏపీ ఫస్ట్ అనే అతి పెద్ద రీసెర్చ్ వ్యవస్థను తెస్తున్నాం. ఐఐటీ-ఐఐఎస్ఈఆర్ కాంబినేషన్ తో ఈ రీసెర్చ్ సెంటర్ తిరుపతిలో స్థాపిస్తున్నాం. కొత్త ఆవిష్కరణలతో యువతకు ఉపాధి చూపించేలా కృషి చేస్తున్నాం” అని ముఖ్యమంత్రి చెప్పారు. 20 దేశాల నుంచి తెలుగు వారు ఈ కార్యక్రమానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
“పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించాం. దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయి. అలాగే దేశానికి వచ్చిన అతి పెద్ద పెట్టుబడి గూగుల్ రూపంలో ఏపీకే వచ్చింది. ఆర్సెల్లార్ మిట్టల్ రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తున్నారు. కాకినాడలో గ్రీన్ అమోనియ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశాను. ఏఎం గ్రీన్ సంస్థ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది” అని ముఖ్యమంత్రి తెలిపారు.
“తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి చేసేలా పరిశ్రమలు స్థాపిస్తున్నాం. అలాగే తక్కువ ఖర్చుతో విద్యుత్ కొనుగోళ్లు చేపడుతున్నాం. విద్యుత్ విషయంలో సంస్కరణలు చేపట్టడం వల్ల డేటా సెంటర్లు రాష్ట్రానికి వస్తున్నాయి. మొత్తంగా రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడులపై కసరత్తు చేస్తున్నాం. ఇది సాకారమైతే 20 లక్షల ఉద్యోగాలు కల్పించగలం” అని స్పష్టం చేశారు.

More Stories
అరాచకాలకు పాల్పడిన వారికి శిక్ష తప్పదు
మార్చి నెలాఖరు నుండి టిటిడి ఆలయాలలో అన్నప్రసాద వితరణ
శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000 ఆలయాలు