* పెండ్యాల గ్రామంలో రాష్ట్రస్తాయి కబడీ పోటీలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
క్రీడలతో శారీరక ధారుడ్యం, మానసికోల్లాసం పెంపొందుతుందని మాజీ శాసనసభ్యులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండల పరిధిలో సోమవారం పెండ్యాల ఉన్నత పాఠశాల ఆవరణలో కీ. శే. చింతోజు సుదర్శనాచారి జ్ఞాపకార్ధం వారి కుమారులు కబడీ సీనియర్ ఆటగాడు చింతోజు విష్ణువర్ధన్ చారి ఆర్ధిక సౌజన్యంతో నవభారతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన స్వామి వివేకానంద 25వ కబడీ చల్లేంజ్ కప్ (సిల్వర్ జూబ్లీ-2026) పోటీలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండ్యాలలో ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయి కబడీ పోటీలు నిర్వహించడం గర్వకారణమని చెప్పారు. ప్రో కబడీ తరహాలో పోటీలు జరుగుతున్నాయని చెబుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి మాట్లాడుతూ పెండ్యాలలో ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి కబడీ పోటీలను నిర్వహించి ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని అభినందించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ జీ మాట్లాడుతూ యూత్ ఐకాన్ స్వామి వివేకానంద స్పూర్తితో యువత పయనించాలని సూచించారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపిచ్చారు. అంతకు ముందు స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాలలు వేసి, జెండాను ఆవిష్కరించి, టాస్ వేసి కబడీ పోటీలను వారు ప్రారంభించారు. కబడీ పోటీలలో మొత్తం 42 జట్లు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో కబడీ పోటీల నిర్వాహకులు, నవభారత్ యూత్ అధ్యక్షుడు చింతోజు విష్ణువర్ధన్ చారి, పెండ్యాల గ్రామ సర్పంచ్ జైత్వారం జగన్ మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ మంత్రి అనసూయ, నవభారత్ యూత్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు జె ప్రహ్లాద్ రెడ్డి, జెడ్పిటిసి మాజీ సభ్యుడు యాచారం జంగయ్య, మాజీ సర్పంచ్ లు అయిల్ల యాదయ్య గౌడ్, మంత్రి సంధ్య రాజేష్, మాజీ ఎంపిటిసి తోట స్వప్న, పరిసర గ్రామాల సర్పంచ్ లు పుష్మమ్మ, లక్ష్మమ్మ, దేవి నాయక్, యాదమ్మ, స్లీవారెడ్డి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమాన్ని సంఘ్ ప్రార్ధనతో భగవద్వజం ఆవిష్కరించి ప్రారంభించారు.

More Stories
మైసమ్మ దేవాలయంలో దేవతా విగ్రహం అపవిత్రంపై ఆగ్రవేశాలు
పోచారం, కాలె యాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్
ఎన్టీవీ జర్నలిస్టుల రిమాండ్ తిరస్కరించిన మెజిస్ట్రేట్