మహిళా ఐఏఎస్ ని కించపరిచిన చానల్స్ పై సిట్

మహిళా ఐఏఎస్ ని కించపరిచిన చానల్స్ పై సిట్
మహిళా ఐఏఎస్‌ అధికారినిని కించపరిచిన కేసు, నారాయణపేట్ మద్దూరు పోలీసు స్టేషన్లో నమోదైన కేసుల విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ సీపీ సజ్జనార్ పర్యవేక్షణలో ఎనిమిది మంది పోలీసు అధికారుల బృందంతో సిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
 తాజాగా మహిళా ఐఏఎస్ అధికారినిని కించపరిచే వార్తలు ప్రసారం చేసిన వ్యవహరంలో ఐఏఎస్‌ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్‌ రంజన్ ఫిర్యాదుతో సీసీఎస్లో రెండు తెలుగు న్యూస్ ఛానెల్స్ సహా ఏడు యూట్యూబ్ ఛానెళ్లపై కేసు నమోదు చేశారు.  
 
కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలను అసభ్యకరంగా రూపొందించి వాట్సాప్ గ్రూప్ల్లో పోస్ట్ చేసిన వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూప్లో కావలి వెంకటేష్ అనే వ్యక్తిపై నారాయణ్‌పేట్ జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.  సిట్‌లో సభ్యులుగా నార్త్‌ రేంజ్‌ జాయింట్‌ సీపీ శ్వేత, చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ గౌతమ్‌, హైదరాబాద్‌ అడ్మిన్‌ డీసీపీ వెంకటలక్ష్మి, సీసీఎస్‌ ఏసీపీ గురు రాఘవేంద్ర, సైబర్‌ క్రైమ్‌ డీసీపీ అరవింద్‌ బాబు, విజిలెన్స్‌ అదనపు ఎస్పీ ప్రతాప్‌, సైబర్‌సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌రెడ్డి, సైబర్‌సెల్‌ ఎస్సై హరీశ్‌ ఉన్నారు.

ఇలా ఉండగా, వ్యక్తిగతగోప్యతకు భంగం కలిగించే వార్తల ప్రసారాన్ని జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ఖండించారు. ఐఏఎస్‌ అధికారిణుల పట్ల అసభ్యంగా రాయడం గర్హనీయం అని మండిపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛ సమాజానికి ప్రాణవాయువులాంటిదన్న ఆయన రాజ్యాంగం పరిమితుల్లేని స్వేచ్ఛకు హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు.

ఇలా ఉండగా, దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక ప్రభుత్వం తమ అంతర్గత రాజకీయాల కంపులోకి ఐఏఎస్‌లను.. అందునా మహిళా ఐఏఎస్‌లను లాగి వారిని మనోవేదనకు గురి చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది మంత్రివర్గ విస్తరణ మొదలు సినిమా టికెట్ల రేట్ల పెంపు వరకు రగులుకున్న చిచ్చు కారణంగా ఓ మంత్రిని లక్ష్యంగా చేసుకొని ఇటువంటి కల్పిత కథనాలను ప్రచారంలోకి తెస్తున్నారని ప్రచారం జరుగుతుంది.
 
సినిమా టికెట్ల రేట్ల పెంపునకు సంబంధించి ‘ముఖ్య’నేతతో చోటుచేసుకున్న పరిణామాలు, ప్రభుత్వ పెద్ద కనుసన్నల్లో నడిచే ప్రముఖ టీవీ చానల్‌లో తనపై అదే దుష్ప్రచారం ప్రముఖంగా రావడంతో మంత్రి కోమటిరెడ్డి నేరుగా ముఖ్యమంత్రిని కలిసి తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తున్నది. దానితో దిద్దుబాటు చర్యలుగా సిట్ ను ఏర్పాటు చేసిన్నట్లు చెబుతున్నారు. పైగా, చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల సంఘాలు ఉమ్మడిగా ఈ ఘటనపై ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తూ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది.