ఏపీలో కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు

ఏపీలో కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త జిల్లాలు, రెవెన్యు డివిజన్లు ఏర్పాటు, పలు మండలాల సరిహద్దులు మార్పులు చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లుగా రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. 

బుధవారం నుంచే కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని తుది నోటిఫికేషన్లలో తెలిపింది. 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చిన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చారు.

ప్రజలకు వేగంగా పాలన అందించడం, సుపరిపాలనే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లనూ ఏర్పాటు చేసింది. పలు మండలాల సరిహద్దులనూ మార్చింది. ప్రజల కోరిక మేరకు సమీప జిల్లాల్లో కలిపింది. కొత్తగా రెవెన్యూ డివిజన్లుగా అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, నంద్యాల జిల్లాలో బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.

సరిహద్దుల మార్పులకు సంబంధించి తుది ప్రకటన జారీ చేసింది. 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో వాటి సంఖ్య 77 నుంచి 82కు చేరాయి. కొత్తగా 2 కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. ఆదోని 1, ఆదోని 2 మండలాల ఏర్పాటుతో రాష్ట్రంలో మండలాల సంఖ్య 679 నుంచి 681కి పెరిగాయి. పెనుగొండ మండలాన్ని వాసవీ పెనుగొండగా మార్చారు. నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్‌ నుంచి టెక్కలికి మార్చారు.

 సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్‌ నుంచి పెద్దపురానికి మార్చారు. పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రీస్ట్రక్చర్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.  గూడురు నియోజవర్గంలోనిలోని 3 మండలాలు నెల్లూరుకు తీసుకువచ్చారు. రేల్వై కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి, రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడపలోకి మార్చాలని మార్చారు. 17 జిల్లాల్లో 25 మార్పులు చేస్తూ తుది ప్రకటన జారీ అయింది.