* మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం
గల్ఫ్ దేశాలతో తన ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో భారత్ – ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను పెంపొందించే లక్ష్యంతో భారత్, ఒమన్ ప్రతినిధులు గురువారం మస్కట్లో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు స్థిరంగా విస్తరిస్తున్న తరుణంలో ఈ ఒప్పందం జరిగింది. భారత్, ఒమన్ మధ్య 2024 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వాణిజ్యం 8.947 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2025 ఆర్థిక సంవత్సరంలో ఇది 10.613 బిలియన్ డాలర్లకు పెరిగింది. అదే సమయంలో ఒమన్ లో 6,000 కంటే ఎక్కువ భారత్-ఒమన్ సంయుక్త సంస్థలు పనిచేస్తుండటంతో పెట్టుబడి సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి.
ప్రస్తుతం 80 శాతానికి పైగా భారతీయ వస్తువులు సగటున 5 శాతం సుంకంతో ఒమన్ కు ఎగుమతి అవుతున్నాయి. అయితే కొన్ని రకాల మాంసాలు, మద్యం, పొగాకు వంటి ఎంపిక చేసిన ఉత్పత్తులపై సుంకాలు సున్నా నుంచి 100 శాతం వరకు ఉన్నాయి. ఈ ఒప్పందాన్ని ద్వైపాక్షిక సంబంధాలలో ఒక మైలురాయిగా భారత్ అభివర్ణించింది.
“రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, వ్యవసాయం, సాంకేతికత, అభివృద్ధి చెందుతున్న రంగాలు, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలతో సహా అనేక విస్తృత అంశాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ తారిక్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా చర్చించారు” అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఒమన్ అత్యున్నత పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ ప్రదానం చేశారు. ఇది ఆ దేశ రెండో అత్యున్నత పురస్కారం. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారంలో మోదీని ఒమన్ ప్రభుత్వం సత్కరించింది.

More Stories
ఏడాదిలో లక్ష వీసాలు రద్దు చేసిన ట్రంప్ సర్కార్
ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25 శాతం సుంకాలు
22 భాషల్లోకి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల అనువాదం