ఆర్థికంగా సంక్షోభంలో తెలంగాణ విద్యుత్ రంగం

ఆర్థికంగా సంక్షోభంలో తెలంగాణ విద్యుత్ రంగం
తెలంగాణ విద్యుత్ రంగం ఆర్థికంగా సంక్షోభంలో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల అప్పులు తడిసి మోపెడయ్యాయని చెబుతూ తెలంగాణకు విద్యుత్ ఉత్పత్తి విషయంలో అన్ని రకాలుగా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థల అప్పుల బాటలో, నష్టాల ఊబిలో పేరుకుపోయాయని విచారం వ్యక్తం చేశారు.
 
వేలకోట్ల రూపాయల అప్పుల భారాన్ని మోయలేక నడ్డి విరుగుతోందని,  విద్యుత్ సంస్థలు ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేసిందని, రూ.30 వేల కోట్లకు పైగా అప్పు ఉందని చెప్పారని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి గుర్తు చేశారు.

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కంపెనీకి 47 వేల కోట్ల రూపాయలు అప్పు ఉందని, విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోందని, విద్యుత్ సంస్థల అప్పుల పరిస్థితి కూడా పెరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. ఒకపూట వర్షాలు, గాలులు వస్తే హైదరాబాద్‌ సహా ఇతర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోతుందని చెప్పారు. కంపెనీలను ఆహ్వానిస్తున్న తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. 

విద్యుత్ లేకపోతే కంపెనీలు రావని పేర్కొంటూ పాత బకాయిల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చెయ్యడం లేదని విమర్శించారు. నిధులు లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటూ ధ్వజమెత్తారు.  గ్లోబల్ హబ్‌గా మారాలంటే విద్యుత్ చాలా కీలకమని చెప్పుకొచ్చారని చెబుతూ కొత్త డిస్కంల ఏర్పాటుపై కాకుండా  విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని హితవు చెప్పారు. 

మనిషి మనుగడ, వ్యవస్థ మనుగడకు విద్యుత్ అత్యంత కీలకమని చెప్పుకొచ్చారు.  74 శాతం విద్యుత్ థర్మల్‌తోనే జరుగుతోందని పేర్కొంటూ గతంలో ఏపీ, తెలంగాణలో విద్యుత్ కోతలు ఉండేవని గుర్తుచేశారు. మోదీ పీఎం కాకముందే విద్యుత్ కోసం ఆందోళనలు జరిగాయని, ఇపుడు 24/7 విద్యుత్ సరఫరా జరుగుతోందని తెలిపారు.

 ఇప్పుడు వన్ నేషన్ – వన్ గ్రిడ్‌తో అనుసంధానం జరిగిందని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ కేబుల్స్ వ్యవస్థ బలోపేతం కోసం కొత్త టెక్నాలజీ అందించామని పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణాకు అనేక రకాలుగా సహకారం అందించిందని తెలిపారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4 వేల మెగావాట్ల పవర్ జనరేషన్ చెయ్యాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. సింగరేణి కంపెనీ డీఎమ్‌ఎఫ్ కింద నిధులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.