తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా
* ఫలితాలపై బిజెపి సంతృప్తి

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ హవా చాటింది. 2,302 సర్పంచి స్థానాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు విజయం సాధించారు. 1,158 పంచాయతీల్లో బీఆర్​ఎస్​ బలపరిచిన అభ్యర్థులు పాగా వేశారు. 528 చోట్ల ఇతరులు, స్వతంత్రులు గెలుపొందగా, 186 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు జయకేతనం ఎగురవేశారు. గురువారం జరిగిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని అధికార కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 2,302 సర్పంచి స్థానాల్లో విజయదుందుభి మోగించారు. 

సిద్దిపేట, కుమురం భీం మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు చోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, 1158 పంచాయతీలను గెలిపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 528 చోట్ల విజయం సాధించారు. బీజేపీ 200లోపు స్థానాలకు పరిమితమైంది.

నల్గొండ, ఖమ్మం, మెదక్, యాదాద్రి, వరంగల్, ఆదిలాబాద్, సూర్యాపేట, కరీంనగర్ జిల్లాలు కామారెడ్డి, జనగామ, నాగర్‌కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ఆధిపత్యం కనపరిచారు. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లోనూ హస్తం మద్దతుదారులదే హవా కొనసాగింది. సిద్దిపేట, కుమురం భీం జిల్లాలో బీఆర్​ఎస్​ బలపరిచిన వారు ఆధిక్యం సాధించారు. మహబూబ్‌నగర్, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో కాంగ్రెస్‌కు బీఆర్‌ఎస్‌ గట్టిపోటీ ఇచ్చింది.

 
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో తొలి విడత 246 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా, బీజేపీ మద్దతుదారులు 160 చోట్ల పోటీ చేసి 41 గెలిచారు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా మూడు విడతల్లో కేవలం 21 మంది బీజేపీ మద్దతుదారులు గెలవగా, ఈసారి మొదటి విడతలోనే 41 మంది గెలిచారు.
 
కాగా, ఈ ఫలితాల్లో బిజెపికి గ్రామీణ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదానికి  రాష్ట్ర అధ్యక్షుడు  ఎన్. రాంచందర్ రావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. బిజెపి మంచి విజయం సాధించడం, గ్రామాల్లో పార్టీ క్రమేణా బలోపేతం అవుతోందని, ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందని ఆయన చెప్పారు.  నరేంద్ర మోదీ ప్రభుత్వం గ్రామపంచాయతీల అభివృద్ధికి కట్టుబడి ఉందని,  ఈ అభివృద్ధి పట్ల ఉన్న ప్రజల నమ్మకమే బిజెపికి వచ్చిన ఈ విజయానికి కారణం అని చెప్పారు. ఇంకా మిగిలిన స్థానిక సంస్థల ఫేజ్–2, ఫేజ్–3 ఎన్నికల్లో  “ప్రజల్లోకి వెళ్లండి, గ్రామాల్లో కేంద్రం చేస్తున్న అభివృద్ధిని వివరించండి, బిజెపిని మరింత బలపరచండి” అంటూ ఆయన బిజెపి కార్యకర్తలకు సూచించారు.