ఎవడబ్బ సొమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫుట్ బాల్ సరదా కోసం రూ.వంద కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఇది ముమ్మాటికీ ఆర్ధిక నేరమే అని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ధ్వజమెత్తారు. ప్రజాధనంతో ఫుట్‌బాల్ ఆడుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు నిన్ను ఫుట్ బాల్ ఆడుకుంటారని ఆయన హెచ్చరించారు.
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజ క్రీడాకారుడు లియోనల్ మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడానికి ప్రభుత్వం రూ.ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోందో, ఏ యో శాఖల నుంచి ఖర్చు చేస్తోందో, ఎందుకు ఖర్చు చేస్తోందో సీఎం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ టీమ్ ను సింగరేణి స్పాన్సర్ చేస్తోందని మీడియాలో చూసానని చెబుతూ ఈ ఫుట్ బాల్ ఆట కోసం సింగరేణి డబ్బులను ఎంత ఖర్చు చేస్తున్నారు? ఎందుకు ఖర్చు చేస్తున్నారు? అని ప్రశ్నించారు.
ఇవే డబ్బులను సింగరేణిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి లేదంటే కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేయవచ్చు కదా అని ఆయన సూచించారు. ప్రభుత్వ శాఖలేవైనా దుబారా ఖర్చులు చేస్తే ను కట్టడి చేయాల్సిన సీఎం, స్వయంగా తన సరదా కోసం దుబారా చేయడం ఆర్ధిక నేరమే అని తేల్చి చెప్పారు. మెస్సీ టీమ్ తో రేవంత్ టీమ్ ఫుట్ బాల్ ఆడడం వల్ల రాష్రానికి వచ్చే ప్రయోజనమేంటో సీఎం చెప్పాలని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు.
అంతర్జాతీయ ఫుట్ బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడితే, అప్పీయరెన్స్ ఫీజు కింద రూ.70 కోట్లు తీసుకుంటారని మీడియా చూశానని చెబుతూ, మరి మెస్సీకి ఇచ్చే అప్పీయరెన్స్ ఫీజు ఏ ప్రభుత్వ శాఖ ఇస్తోంది?దాని వల్ల కలిగే ప్రయోజనమేంటి? అని ప్రశ్నించారు. మెస్సీకి ఇచ్చే మొత్తంతోపాటు ఆయన వ్యక్తిగత భద్రత సిబ్బందికి వసతి, విమాన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తున్నదని, అంతా కలిపి రూ.వంద కోట్లకుపైగా ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
సింగరేణి, పర్యాటక, క్రీడల శాఖల నుంచి నిధులను మెస్సీ టూర్ కు మళ్లించినట్టు తెలుస్తున్నదని చెబుతూ ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ తో ఈ మూడు శాఖలకు కలిగే ప్రయోజనమేంటి? అని నిలదీశారు. దేశంలోనే అత్యుత్తమ పది క్రికెట్ గ్రౌండ్లలో ఒకటైన ఉప్పల్ స్టేడియానికి ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ తో తూట్లు పొడుస్తున్నారని ఆయన విమర్సించారు.
ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం ఉప్పల్ క్రికెట్ గ్రౌండును ఫుట్ బాల్ గ్రౌండుగా మార్చాలని, మ్యాచ్ ముగిసాక మళ్లీ దాన్ని క్రికెట్ గ్రౌండుగా మార్చేందుకు రూ.10 కోట్ల వరకు ఖర్చు కావచ్చని ఆయన తెలిపారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వానికి, మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు ఎలాంటి సంబంధం లేదని సిఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రపంచంలోనే ప్రముఖ క్రీడాకారుడు మెస్సీ హైదరాబాద్‌కు వస్తున్నందున ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ఆహ్వానించినట్టు చెప్పారు. అయితే, కేరళ ప్రభుత్వం ఈ మ్యాచ్‌కు ఖర్చులు భరింపలేమని చేతులెత్తేయడంతో నిర్వాహకులు రేవంత్ రెడ్డిని ఆశ్రయించారని బీజేఎల్పీ నేత స్పష్టం చేశారు.

More Stories
అస్సాం, బెంగాల్ ల్లో కాంగ్రెస్ ఎమ్యెల్యేలు అందరూ ముస్లింలే!
ఎన్నికల అనంతరం హింసలో సువేందు అధికారి పిఎ కాల్చివేత
ఎన్నికల అనంతరం హింసలో 200 ఎఫ్ఐఆర్ లు, అదుపులో 1500 మంది