దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ భారత్‌ కైవసం

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ భారత్‌ కైవసం
దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుంది. శనివారం  జరిగిన మూడో వన్డేలో టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో(61 బంతులు మిగిలుండగానే) భారీ విజయం సాధించింది. తద్వారా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.  సఫారీలు నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 39.5 ఓవర్లలో 271/1 స్కోరు చేసింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(121 బంతుల్లో 116 నాటౌట్‌, 12 ఫోర్లు, 2సిక్స్‌లు) తొలి వన్డే సెంచరీకి తోడు రోహిత్‌శర్మ(73 బంతుల్లో 75, 7ఫోర్లు, 3సిక్స్‌లు), విరాట్‌కోహ్లీ(45 బంతుల్లో 65 నాటౌట్‌, 6ఫోర్లు, 3సిక్స్‌లు) అర్ధసెంచరీలతో విజృంభించారు.

ఈ ముగ్గురి బ్యాటింగ్‌ జోరుతో సఫారీ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా టీమ్‌ఇండియా టాపార్డర్‌ బ్యాటర్లు జట్టుకు అలవోక విజయాన్నందించారు. కేశవ్‌ మహారాజ్‌కు ఏకైక వికెట్‌ దక్కింది. అంతకుముందు క్వింటన్‌ డికాక్‌(89 బంతుల్లో 106, 8ఫోర్లు, 6సిక్స్‌లు) సెంచరీతో దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసింది.  114 పరుగులకు రెండు వికెట్లతో మెరుగ్గా కనిపించిన దక్షిణాఫ్రికా..ప్రసిద్ధ్‌(4/66), కుల్దీప్‌యాదవ్‌(4/41) ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది.

జైస్వాల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కగా, కోహ్లీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ కైవసం చేసుకున్నాడు. సఫారీలు నిర్దేశించిన లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన టీమ్‌ఇండియాకు మెరుగైన శుభారంభం దక్కింది. క్రీజులో నిలదొక్కుకునేందుకు ఓపెనర్లు జైస్వాల్‌, రోహిత్‌ సమయం తీసుకున్నారు. ముఖ్యంగా బార్ట్‌మన్‌ బౌలింగ్‌లో పరుగులు సాధించేందుకు జైస్వాల్‌ ఇబ్బంది పడ్డాడు. 

మరోవైపు తన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ రోహిత్‌ ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అలరించాడు. 54 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్‌ అందుకున్న రోహిత్‌ ఆ తర్వాత తన జోరు పెంచాడు. మరో ఎండ్‌లో జైస్వాల్‌ 75 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుని రోహిత్‌కు జతకలిశాడు. సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను మహారాజ్‌..

రోహిత్‌ను ఔట్‌ చేయడం ద్వారా తొలి వికెట్‌కు 155 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. అయితే అర్ధసెంచరీ తర్వాత జైస్వాల్‌ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. కోహ్లీతో కలిసి దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 111 బంతుల్లో వన్డేల్లో తన తొలి సెంచరీ అందుకుని గెలుపు సంబురాల్లో మునిగిపోయాడు. సిరీస్‌లో సూపర్‌ఫామ్‌ మీదున్న కోహ్లీ కూడా ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగడంతో లక్ష్యం అంతకంతకూ కరిగిపోయింది. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు అజేయంగా 156 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు భారీ విజయాన్ని కట్టబెట్టారు.

కాగా, రోహిత్‌శర్మ అరుదైన రికార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిసి 20 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్‌గా నిలిచాడు.