విదేశాల నుంచి పలువురు కాంగ్రెస్ నేతల ఎక్స్ ఖాతాలు

విదేశాల నుంచి పలువురు కాంగ్రెస్ నేతల ఎక్స్ ఖాతాలు

కాంగ్రెస్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతల ఎక్స్ ఖాతాలను విదేశాల నుంచి నిర్వహిస్తున్నారని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర సంచలన ఆరోపణలు చేశారు. పేర్కొన్నారు. విదేశీ ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా భారత ప్రజలను ప్రభావితం చేయడానికి కాంగ్రెస్ యత్నిస్తోందని ఆయన విమర్శించారు.

రాహుల్ గాంధీ మనుషులకు భారత గడ్డతో ఎలాంటి కనెక్షన్ లేదని, వాళ్లంతా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆగ్నేయ ఆసియా, పశ్చిమ ఆసియా, ఐరోపా, అమెరికాలో కూర్చొని ఎక్స్ పోస్ట్‌ల ద్వారా భారత ప్రజలను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేకించి ఓట్ల చోరీ, ఆపరేషన్ సిందూర్ వంటి కీలక అంశాలపై ఆయా దేశాల నుంచి ట్వీట్‌లు చేస్తున్నారని ఆయన చెప్పారు. 

ఇటువంటి సున్నిత అంశాలపై భారత ప్రజల ఆలోచనా వైఖరిని మార్చాలనే పన్నాగం దీని వెనుక దాగి ఉందని ఆయన ధ్వజమెత్తారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా తతంగాన్ని నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. చివరకు రాహుల్ గాంధీ సైతం విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడల్లా భారత్ వ్యతిరేక విమర్శలు చేస్తున్నారని సంబిత్ పాత్ర గుర్తు చేశారు.

ఒక పక్కా ప్రణాళిక ప్రకారమే విదేశాల నుంచి రాహుల్ గాంధీకి ఈ పని దొరుకుతోందని బీజేపీ ఎంపీ స్పష్టం చేశారు. బీజేపీ అధికారిక ఎక్స్ ఖాతా ఇండియా లొకేషన్‌ను చూపిస్తుంటే, కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా ఎక్స్ ఖాతా అమెరికా లొకేషన్‌ను చూపిస్తోందని ఆయన తెలిపారు.  మహారాష్ట్ర కాంగ్రెస్ ఎక్స్ ఖాతా ఐర్లాండ్ లొకేషన్‌‌ను చూపించేదని, దాన్ని ఇటీవలే ఇండియా లొకేషన్‌కు మార్చారని ఆయన చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఎక్స్ ఖాతా థాయ్‌లాండ్ లొకేషన్‌ను చూపిస్తోందని సంబిత్ పాత్ర పేర్కొన్నారు.

పైన పేర్కొన్న దేశాల నుండి సోషల్ మీడియా ఖాతాలు కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ ఆరోపణలపై భారత ఎన్నికల కమిషన్ పై దురుద్దేశపూరిత ప్రచారాన్ని సృష్టించడమే లక్ష్యంగా ఉన్నాయని పూరి ఎంపీ ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్న ఈ ఖాతాలలో చాలా వరకు నకిలీ ఐడిలు అని ఆయన ఆరోపించారు.

 
“ప్రధాని మోదీని, ఆర్ఎస్ఎస్ ని కించపరచడానికి, రాహుల్ గాంధీని ప్రోత్సహించడానికి, విదేశాలలో ఉన్న ఖాతాలు పనిచేస్తున్నాయి” అని పాత్ర ధ్వజమెత్తారు. “సింగపూర్‌లోని ప్రజలు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడానికి కృషి చేస్తున్నారు. వారు ఓటర్లు కాదు లేదా భారతీయులు కాదు… పశ్చిమాసియా, సింగపూర్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రజలు రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నారు. ఆయనకు విదేశాల నుండి గొప్పతనానికి సంబంధించిన సర్టిఫికెట్లు వస్తున్నాయి” అని ఎద్దేవా చేశారు.