1500 ఏళ్ల భావన్నారాయణ స్వామి రథం వేలం

1500 ఏళ్ల భావన్నారాయణ స్వామి రథం వేలం
బాపట్ల పట్టణంలోని సుమారు 1500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి దేవాలయంలో ఉన్న పాత రథాన్ని వేలంపాటకు పెట్టాలనే దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయంపై స్థానిక భక్తులు, బాపట్ల ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దేవాలయ చరిత్ర, స్థానిక సాంస్కృతిక వారసత్వానికి నిదర్శనంగా నిలిచిన ఈ రథాన్ని డబ్బుల కోసం అమ్మడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  
 
పురాతన రథాన్ని వేలం వేసి ఆదాయం పొందేందుకు ప్రయత్నించేందుకు బదులుగా, దేవాలయ పరిసరాల్లోనే ఒక ప్రత్యేక ప్రదేశంలో ఈ రథాన్ని పురావస్తు వస్తువుగా సంరక్షించాలని భక్తులు కోరుతున్నారు. ఇలా ఉంచితే భావన్నారాయణ స్వామి దేవాలయ గొప్ప చరిత్రకు ఇది శాశ్వత చిహ్నంగా నిలిచి, భవిష్యత్ తరాలకు కూడా బాపట్ల ఆధ్యాత్మిక, సాంస్కృతిక గౌరవాన్ని గుర్తుచేస్తుందని స్థానికులు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాత రథం వేలంపాట నిర్ణయంపై మరోసారి పునరాలోచించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. వేలంపాట నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని, రథం యొక్క వైశిష్ట్యం, పురాతనతను కాపాడేలా సంరక్షణ చర్యలు తీసుకుంటే, దేవాలయ పరంగా మాత్రమే కాకుండా బాపట్ల పట్టణ గౌరవానికీ, ఆధ్యాత్మిక వారసత్వ పరిరక్షణకీ అది మేటి నిర్ణయమవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.