ఏపీ రాజధాని అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసే దిశగా నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం అమరావతిలో ఒకేసారి 12 బ్యాంకుల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనుంది. ఈనెల 28న కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించింది. గత నెలలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మొత్తం 25 జాతీయ, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ప్రధాన కార్యాలయాలకు స్థలాలు కేటాయించారు. వీటిలో 12 బ్యాంకుల భవనాలు మొదటిగా నిర్మాణ దశలోకి అడుగుపెడుతున్నాయి. వీటితో పాటు అధికారుల నివాస భవనాల నిర్మాణాలకు అమరావతిలో శంకుస్థాపన జరగనుంది.
చాలా బ్యాంకులు తమ స్థలాలను ఇప్పటికే సిద్ధం చేసుకుని నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధం అయ్యాయి. అయితే ఈ బ్యాంకులను ఏర్పాటు చేయడానికి భవన నిర్మాణాలకు 2014-2019 మధ్యలోనే స్థలాలు కేటాయించినప్పటికీ పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత వైసిపి ప్రభుత్వ హయాంలో వీటి కోసం ఒక అడుగు కూడా ముందుకు పడలేదు.
రాజధానిలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం వద్ద అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ బ్యాంకుల ఏర్పాటుతో అమరావతి రాష్ట్ర ఆర్థిక కేంద్రంగా ఎదగనుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు నారాయణ, నారా లోకేష్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

More Stories
శ్రీ పద్మావతీ అమ్మవారి వాహనసేవలో తరిస్తున్న శ్రీ రంగం శ్రీవైష్ణవులు
పిఠాపురం నుంచే జనసేన ప్రక్షాళన కసరత్తు!
మానవ సేవ దైవ సేవ అని చెప్పిన సత్యసాయి