ప్రపంచం ఎదుర్కొంటున్న అసమానతలు, వాతావరణ మార్పులపై జి20 దేశాలు నిబద్దతతో పోరాడుతున్నాయని దక్షిణాఫ్రికా అధ్యక్షులు సిరిల్ రామఫోసా తెలిపారు. దక్షిణాఫ్రికాలోని జోహన్స్‌బర్గ్‌లో రెండు రోజుల పాటు జరిగిన జి 20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఆతిధ్య దేశాధ్యక్షుడైన రామఫోసా ముగింపు సందేశం ఇచ్చారు.
అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన వేదికగా ఉన్న జి20 ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సవాళ్లను పరిష్కరించాలన్న నిబద్ధతతో ఉందని చెప్పారు. అనేక సవాళ్ల మధ్య మెరుగైన ప్రపంచాన్ని నెలకొల్పాలన్న సంకల్పానికి కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఘర్షణలు, యుద్ధాలను ముగించాలని, సమగ్రమైన, న్యాయమైన, శాశ్వత శాంతికి జి20 పిలుపునిస్తుందని చెప్పారు.
రుణభారాలను ఎదుర్కొంటున్న తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు మద్దతు ఇవ్వాలని ప్రతిజ్ఞ తీసుకుందని తెలిపారు. వాతావరణ ప్రేరిత ప్రకృతి వైపరీత్యాలతో నష్టాలు పాలైన దేశాల పునర్నిర్మాణానికి సహాయాన్ని వేగవంతం చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నట్లు తెలిపారు.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030ను అందుకోవడానికి చర్యలను వేగవంతం చేయాలని కోరారు. ప్రపంచంలో ఎవరూ వెనుకబడిపోకుండా చూసుకోవాలని రామఫోసా కోరారు. జి20 సదస్సు ముగింపు సందర్భంగా డిక్లరేషన్‌ను చదవి వినిపించారు. ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ వంటివి నిర్ణయాలు తీసుకోవడంలో అభివృద్థి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం, వాణి పెరగాలని డిక్లరేషన్‌లో నాయకులు కోరారు.
కాగా, ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య ఫలప్రదమైన సమావేశం జరిగిందని భారత్ విదేశాంగశాఖ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. నూతన సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలు పెంచేందుకు ఇరు దేశాధినేతల మధ్య చర్చ జరిగినట్టు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. స్టార్టప్ రంగంలో పెట్టుబడులను సులభతరం చేసేందుకు ఇరు దేశాధినేతలు ఓ అంగీకారానికి వచ్చారని స్పష్టం చేశారు. రామఫోసాతో అద్భుతమైన సమావేశం జరిగిందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

More Stories
10 వేల ఏళ్ల తర్వాత పేలిన ఇథియోపియాలోనిఅగ్నిపర్వతం
షాంఘైలో భారత మహిళకు వేధింపులు
మాటలకే పరిమితమైన వాతావరణ సదస్సు