శంషాబాద్ లో రూ. 3 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు

శంషాబాద్ లో రూ. 3 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు
శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా ఎలక్ట్రానిక్‌ పరికరాలు పట్టుబడటం కలకలం రేపింది. అబుదాబీ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద సుమారు రూ.3 కోట్ల విలువైన వస్తువులను సెంట్రల్‌ ఇండిస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
నిత్యం ప్రయాణీకులతో రద్దీగా ఉండే శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అబుదాబీ నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.  వారి లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేయగా, పెద్ద సంఖ్యలో డ్రోన్లు, ఎలక్ట్రానిక్‌ స్మార్ట్‌ వాచ్‌లు, ఖరీదైన ఐఫోన్లు బయటపడ్డాయి.
స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్‌ వస్తువుల విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. నిందితులను సూర్య ప్రకాశ్‌, మహమ్మద్‌ జాంగిర్‌గా గుర్తించారు. ఇంత పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఎలాంటి పత్రాలు లేకుండా ఎందుకు తరలిస్తున్నారనే కోణంలో విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వస్తువులను ఎక్కడికి తరలించడానికి ప్రయత్నించారు? దీని వెనుక ఎవరైనా ఉన్నారా? అనే వివరాలను రాబట్టే పనిలో అధికారులు దర్యాప్తు చేపట్టారు.