ఢిల్లీ పేలుడు కిరాతక ఉగ్ర ఘాతుకం

ఢిల్లీ పేలుడు కిరాతక ఉగ్ర ఘాతుకం
ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర మంత్రివర్గం ఖండిస్తూ దీనిని కిరాతక ఉగ్ర ఘాతుకంగా అభిప్రాయపడింది. ఈ పేలుడు ఘ‌ట‌న ఉగ్ర‌వాదుల చ‌ర్యే అని కేంద్రం పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌కు కార‌కులైన వారిని చ‌ట్టం ముందు నిల‌బెడుతామ‌ని తెలిపింది.మృతుల కుటుంబాలకు సంతాపంగా కేంద్ర మంత్రివర్గం 2 నిమిషాల మౌనం పాటించింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.
ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్‌ విధానంపై పునరుద్ఘాటించిన మంత్రివర్గం డిల్లీ పేలుడు ఘటన విచారణను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించింది. ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని, ఈ ఘటనకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. పేలుడు ఘటనపై కేంద్రం ఉన్నతస్థాయిలో పర్యవేక్షిస్తోందని వివరించారు.
 
“నవంబర్​ 10 సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో దేశవ్యతిరేకులు చేసిన బాంబు పేలుడును దేశం చూసింది. ఈ దాడితో పలువురు మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు కేంద్ర కేబినెట్​ సంతాపం తెలిపింది. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్‌ విధానంతో ఉన్నాం. ముఖ్యంగా దిల్లీ పేలుడు ఘటన విచారణను వేగవంతంగా చేపట్టాలని కేబినెట్‌ ఆదేశించింది. పేలుడు వెనుక ఉన్న కుట్రదారులను చట్టం ముందు ఉంచుతాం. పేలుడు ఘటనపై కేంద్రం ఉన్నతస్థాయిలో పర్యవేక్షిస్తోంది” అని కేంద్ర మంత్రి తెలిపారు.
మరోవంక, ఆరేళ్లపాటు రూ. 25,60 కోట్లతో ఎక్స్‌పోర్టు ప్రమోషన్‌ మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎగుమతి ప్రోత్సాహక మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం వేసిందని అశ్విణీ వైష్ణవ్​ తెలిపారు. దీని ద్వారా ఆరేళ్లపాటు రూ.25,060 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పిన ఆయన, ఎగుమతుల ఎకో సిస్టమ్‌ బలోపేతానికే ఈ మిషన్‌ను తీసుకొచ్చినట్లు వివరించారు.
 
 ఎగుమతిదారుల కోసం రూ. 20 వేల కోట్ల రూపాయలతో క్రెడిట్ గ్యారంటీ పథకం విస్తరణకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. గ్రాఫైట్​, రబీడియం, జిక్రోనియం లాంటి క్రిటికల్​ మినరల్స్​పై రాయల్టీ రేటును సవరించింది. ఈ నిర్ణయం దిగుమతులను తగ్గించి, స్వదేశంలోనే హైటెక్​ మినరల్​ ఉత్పత్తికి బాటలు వేయనుంది. దీంతో పాటు కొత్త పెట్టుబడి రంగాన్ని ప్రొత్సహించనున్నట్లు పేర్కొంది.
 
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనపై అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని నివాసంలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు. ఎర్రకోట బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన కీలక విషయాలను ఇందులో చర్చించారు. దర్యాప్తు కొనసాగుతున్న తీరు, భద్రతా చర్యలు, ఆయా సంస్థల మధ్య సమన్వయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడి లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధాని నరేంద్రమోదీ  పరామర్శించారు. రెండు రోజుల భూటాన్‌ పర్యటన ముగించుకుని రాగానే ప్రధాని నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఒక్కొక్కరిని కలిసి మాట్లాడారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.