హోమ్ శాఖ కోసం పట్టుబడుతున్న అజారుద్దీన్‌!

హోమ్ శాఖ కోసం పట్టుబడుతున్న అజారుద్దీన్‌!
క్రికెటర్ అజారుద్దీన్‌ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో చేరి నాలుగు రోజులైనా ఇప్పటివరకు ఆయనకు మంత్రిత్వ శాఖ కేటాయించలేదు. ఒక వంక పార్టీతో సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్న ఆయనను అర్ధాంతరంగా మంత్రిగా చేయడం పట్ల పార్టీలో సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరోవంక కీలకమైన హోం మంత్రిత్వ శాఖకు ఆయన పట్టుబడుతూ ఉండడంతో ముఖ్యమంత్రి ఎటూ తేల్చుకోలేక పోతున్నట్లు తెలుస్తున్నది.
గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో హోంశాఖను కేసీఆర్ మైనారిటీ నేత మొహమ్మద్ అలికి ఇచ్చారు. పైగా ఆయనను ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. అందుకనే తనకే ఆ శాఖను కేటాయించాలని ఢిల్లీ స్థాయిలో రేవంత్ రెడ్డిపై వత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. ప్రియాంక గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉండడంతో ఈ విషయమై ఢిల్లీ పెద్దల నుండే ముఖ్యమంత్రి వత్తిడులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. 
ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దనే హోంశాఖ ఉంది. ఆ శాఖను కేటాయిస్తే మంత్రి పదవులు పొందలేకపోతున్న పార్టీలోని సీనియర్ల నుండి ఇబ్బందులు ఎదురవుతాయని రేవంత్ రెడ్డి వెనుకడుగు వేస్తున్నారు. మైనారిటీలు, క్రీడల శాఖ ఇవ్వడానికి మాత్రమే సుముఖంగా ఉన్నారు. అందుకు  అజారుద్దీన్‌ ససీమిరా అంటున్నారు. జూబ్లీ హిల్స్ లో గెలుపు కోసమే ఆయనకు ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చామని చెబుతున్నా ఇప్పటి వరకు ఆయన ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. మంత్రి వర్గ విస్తరణ పట్ల అసంతృప్తితో ఉన్న సీనియర్ నేతలు ఎవ్వరూ కూడా ప్రచారంలో పాల్గొనడం లేదు .
మరోవంక, గత ఎన్నికలలో ఓడిపోయిన అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇవ్వడంతో అధిష్టానంపై ఆగ్రహంగా ఉన్న సీనియర్లు మైనారిటీ ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చామని అధిష్టానం సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని తెలుస్తున్నది. మైనారిటీలలో అయితే తమ పేర్లు ఎందుకు పరిశీలించలేదని ఫిరోజ్ ఖాన్, షబ్బీర్ అలీ మండిపడుతున్నారు.

జూబ్లీహిల్స్ రేసు నుంచి తప్పుకున్న తనకు ఏ పదవి ఇవ్వలేదని మాజీ ఎంపీ అంజన్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ళుగా బీఆర్ఎస్‌తో కొట్లాడిన నన్ను ఎందుకు పక్కన పెట్టారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిలదీస్తున్నారు. ఇదేసమయంలో మంత్రి పదవులు ఆశించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడంపై మధుయాష్కీ గౌడ్, జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తామెవరికి చెప్పకుండా ఇటువంటి నిర్ణయాలు ఏవిధంగా తీసుకుంటారని  ప్రశ్నించారు.