మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం

మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్‌ శుక్రవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. మంత్రివర్గంలో అజారుద్దీన్‌ చేరికతో తెలంగాణ కేబినెట్‌ మంత్రుల సంఖ్య 16కి చేరింది. అయినా తెలంగాణ కేబినెట్‌లో ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మంత్రిగా ప్రమాణస్వీకారం అనంతరం అజారుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు.

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కిషన్‌ రెడ్డి ఏమైనా మాట్లాడతారని, దేశభక్తిపై నాకు ఎవరి సర్టిఫికెట్‌ అవసరం లేదని స్పష్టం చేశారు. తన గురించి ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  జూబ్లీహిల్స్‌ ఎన్నికలకు తన మంత్రి పదవికి సంబంధం లేదని తెలిపారు. తనను కేబినెట్‌లోకి తీసుకోవడం సీఎం రేవంత్‌ రెడ్డి, హైకమాండ్‌ నిర్ణయమని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు. ఏ శాఖ ఇచ్చినా న్యాయం చేస్తాననే నమ్మకం ఉందని చెప్పారు.

కాగా, దేశ ద్రోహానికి పాల్పడి భారత్‌కు చెడ్డపేరు తెచ్చిన వ్యక్తి అజారుద్దీన్‌ అని గురువారం  కిషన్‌ రెడ్డి విమర్శించారు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్‌ మంత్రి పదవి ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అవమానమని విమర్శించారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. దేశ గౌరవానికి భంగం కలిగించిన వ్యక్తిని గవర్నర్‌ కోటాలో కాంగ్రెస్‌ ఎలా ఎమ్మెల్సీని చేస్తుందని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. 

జూబ్లీహిల్స్‌లో ఎప్పుడూ పోటీ చేసే ఎంఐఎం పార్టీ ఈసారి ఎందుకు పోటీ చేయడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ముసుగులో మజ్లిస్‌ అభ్యర్థే ఎన్నికలో పోటీ చేస్తున్నాడని విమర్శించారు.

హైదరాబాద్‌ నగరంలో 1963 ఫిబ్రవరి 8న అజారుద్దీన్‌ జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. నిజాం కళాశాలలో బీకాం చదవారు. తన మేనమామ జైనులాబుద్దీన్‌ స్ఫూర్తితో క్రికెట్‌ రంగం వైపు అడుగులు వేశారు. 1984లో అజారుద్దీన్​ అంతర్జాతీయ క్రికెట్‌లో రంగప్రవేశం చేశారు. క్రికెటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లో తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలతో సంచలనం సృష్టించారు.

1989లో భారత క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా అజారుద్దీన్ భాధ్యతలు చేపట్టారు. 16 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో 99 టెస్టులు, 334 వన్డేలు ఆడారు. రిటైర్మెంట్‌ అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఫిబ్రవరి 19వ తేదీన కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అదే ఏడాది యూపీలోని మొరాదాబాద్‌ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్‌ను నియమించారు. తాజాగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.