హిందూ మహిళపై అత్యాచారం… అబ్దుల్ లతీఫ్ కు పదేళ్లు జైలు

హిందూ మహిళపై అత్యాచారం… అబ్దుల్ లతీఫ్ కు పదేళ్లు జైలు

*హిందూ మహిళను ప్రేమిస్తూ, హిందువుగా మారుతానని నమ్మించి మోసం చేసిన ముస్లిం యువకుడు.
 
ఒక హిందూ మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి, హిందువుగా మారతానని నమ్మించి అత్యాచారం చేసిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, మోసం చేసినందున మరో సంవత్సరం సాదారణ జైలు శిక్ష విదిస్తూ మహిళలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ జడ్జి హరీష బుధవారం తీర్పు చెప్పారు. 
 
కోర్టు వెలవరించిన 43 పేజీల తీర్పులోని వివరాలు ప్రకారం నిజామాబాద్ నగర పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం అదారంగా నేర న్యాయ విచారణలో భాగంగా మొత్తం 13 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశారు. 12 ధ్రువీకరించుకున్న పత్రాలు, రెండు వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసిన అనంతరం ప్రాసిక్యూషన్, ముద్దాయి తరపున న్యాయవాదుల వాదనలు వినిపించారు. 
 
అన్నింటిని అధ్యయనం చేసిన పిదప నేరారోపితుడు అయిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ పై మహిళను మోసం చేసి, పదే పదే ఆమెపై అత్యాచారం చేసిన నేరారోపణలు రుజువు అయినట్లు న్యాయస్థానం నిర్దారించింది. ఒక హిందూ మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి హిందువుగా మారి పెళ్లి చేసుకుంటానని ఆమెను లొంగదీసుకుని ఆమె ఇంటిలో, అతని ఇంటికి తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారం చేశాడు. మాయమాటలు చెప్పి మోసం చేశాడు.
 
భారత శిక్షస్కృతి సెక్షన్ 417(మోసం చేయడం ) ప్రకారం ఒక సంవత్సరం సాదారణ జైలుశిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా, జరిమానా చెల్లించని యెడల అదనంగా మూడు నెలల జైలుశిక్ష, సెక్షన్ 376(2)(n) పదే పదే అత్యాచారం చేసిన నేరానికిగాను పది సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా, జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల
సాదారణ జైలు శిక్ష అనుభవించాలని అదనపు సెషన్స్ హరీష తమ తీర్పులో పేర్కొన్నారు.
 
పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు. కాగా,  బాధిత మహిళకు ఐదు లక్షల రూపాయల పరిహారం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చెల్లించాలని జడ్జి హరీష తమ తీర్పులో సిపార్సు చేశారు.