25 పాక్ ఆర్మీ పోస్టుల స్వాధీనం.. 58 మంది సైనికుల హతం!

25 పాక్ ఆర్మీ పోస్టుల స్వాధీనం.. 58 మంది సైనికుల హతం!
 

పాకిస్థాన్‌ – అఫ్గానిస్థాన్‌ బలగాల మధ్య జరిగిన ఘర్షణలో పాక్‌ సైనికులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. ఖైబర్‌-పఖ్తుంక్వా, బలూచిస్థాన్‌ సరిహద్దుల్లో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 58 మంది పాకిస్థాన్ సైనికులు మరణించినట్టు అఫ్గానిస్థాన్ అధికారులు తెలిపారు. 25 పాక్​ ఆర్మీ పోస్ట్​లను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. 

అలాగే పాకిస్థాన్​ చేసిన దాడికి సమాధానం ఇవ్వకుండా వదిలపెట్టబోమని హెచ్చరించారు. మరోవైపు ఈ దాడుల నేపథ్యంలో అఫ్గానిస్థాన్​  సరిహద్దును మూసివేసినట్లు పాకిస్థాన్ అధికారులు తెలిపారు. “పాకిస్థాన్ తన నేలపై ఐసిస్‌ ఉనికిని చూసీ చూడనట్లు ప్రవర్తించింది. అఫ్గాన్​కు తన గగనతల, భూసరిహద్దులను రక్షించుకునే హక్కు ఉంది. ఏ దాడినీ మౌనంగా వదిలిపెట్టదు” అని హెచ్చరించింది. 

“పాకిస్థాన్​ తమ భూభాగంలో దాక్కున్న ఐసిస్‌ కీలక సభ్యులను బయటకు పంపాలి లేదా ఇస్లామిక్‌ ఎమిరేట్‌ అధికారుల చేతికి అప్పగించాలి. ఐసిస్‌ ప్రపంచంలోని అనేక దేశాలకు, ముఖ్యంగా అఫ్గాన్​కు, తీవ్రమైన ముప్పుగా ఉంది. ఇస్లామిక్‌ ఎమిరేట్‌ తమ భూభాగంలో కల్లోలం సృష్టిస్తున్నవారిని తొలగించింది” అని తెలిపారు. 

“అయితే, ఆ గుంపులు పఖ్తుంక్వాలో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేశాయి. కరాచీ, ఇస్లామాబాద్‌ విమానాశ్రయాల ద్వారా కొత్తగా చేరిన నియామకులను ఈ శిక్షణా కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. అఫ్గాన్​పై జరిగే దాడులు కూడా ఈ కేంద్రాల నుంచే ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నాయి. దీని గురించి సాక్ష్యాలు కూడా మాకు దగ్గర ఉన్నాయి. ఈ ఘర్షణల్లో ఇస్లామిక్‌ ఎమిరేట్‌ బలగాల చేతికి పాకిస్తాన్‌ ఆయుధాల గణనీయమైన నిల్వలు దొరికాయి. మా భూభాగంపై దాడి చేసినా లేదా తమ గగనతలాన్ని ఉల్లంఘించినా కఠినమైన ప్రతిస్పందనను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ముజాహిద్​ తెలిపారు.

శనివారం రాత్రి పాక్‌ సరిహద్దుల వెంట తాలిబన్‌ బలగాలు కాల్పులు జరిపాయి. అనంతరం అఫ్గాన్‌ సరిహద్దులు లక్ష్యంగా పాక్ దాడులకు దిగింది. గురువారం అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో తెహ్రీక్‌ ఇ తాలిబన్‌ పాకిస్థాన్‌ (టిటిపి ) చీఫ్‌ నూర్ వాలి మెహ్సూద్‌ స్థావరం లక్ష్యంగా పాక్‌ ఫైటర్‌ జెట్లు దాడి చేసినట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆరోపించారు. 

అయితే, ఈ దాడులకు ప్రతీకారంగానే ప్రస్తుతం తాలిబన్‌ దళాలు సరిహద్దుల వెంబడి దాడులు చేపట్టినట్లు అఫ్గాన్‌ అధికారులు వెల్లడించారు. పాక్‌ బలగాలు నిబంధనలను ఉల్లంఘిస్తే తమ సాయుధ దళాలు దాడులను మరింత ఉధృతం చేస్తాయని హెచ్చరించారు.