నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది

నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది

హైదరాబాద్ అంటే కేవలం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ మాత్రమే కాదు, నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచేలా నగరాభివృద్ధి జరగాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్రం నుంచి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం గురువారం జరిగిన సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, వివిధ శాఖల ప్రతినిధులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర పథకాలను సమయానుకూలంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి శాఖల మధ్య మెరుగైన సమన్వయం ఉండాలని సూచించారు.

హైదరాబాద్ అభివృద్ధి కోసం అన్ని శాఖలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. హైదరాబాద్ నగరంలో నిధుల కొరత ఉన్నప్పటికీ, లభ్యమవుతున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి చేయాలని చెప్పారు. బస్తీలు, మురికివాడల్లో ఇంకా పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారం కోసం అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని కిషన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లో చిన్నపాటి వర్షం కురిసినా రోడ్లు జలమయమై ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

ఇటీవల వర్షాల కారణంగా నాంపల్లిలో ఇద్దరు, సనత్‌నగర్‌లో ఒక యువకుడు నాలాలో కొట్టుకుపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలతో పాటు అన్ని శాఖల అధికారులు కలిసికట్టుగా పనిచేసి నగర ప్రాధాన్యతను గుర్తుంచుకొని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏ బస్తీకి వెళ్లినా వర్షపు నీరు, వరదలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అనేక ప్రాంతాల్లో డ్రైయినేజీ సిస్టం దెబ్బతిని తాగునీటితో కలిసిపోతోందని దీనివల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

హైడ్రాతో సమన్వయం చేసుకొని ముంపు లేకుండా శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ కోరారు. వర్షాలు భారీగా కురవడం సంతోషమే కానీ, ఎన్నడు నీళ్లు రాని కాలనీలు కూడా మునుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా అంగన్వాడీ కేంద్రాలలో మరుగుదొడ్లు లేవని, ఒకే గదిలో పిల్లలు ఉంటున్నారని, అదే రూంలో వంట చేస్తున్నారని తెలిపారు. స్కూల్‌కి సెంట్రల్ కిచెన్ ఎలా ఉందో, అంగన్వాడీ కేంద్రాలకు కూడా సెంట్రల్ కిచెన్ నుండి భోజనం పంపించే ఏర్పాటు చేయాలని రాజేందర్ సూచించారు.