నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాట చరిత్రను తెలియజేసే ప్రత్యేక రజకార్ సినిమా ప్రత్యేక స్క్రీనింగ్‌ను సెప్టెంబరు 11న నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. ఎమ్మెల్సీ, తెలంగాణ విమోచన దినోత్సవాల కమిటీ చైర్మన్ అంజిరెడ్డితో కలిసి సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని కరపత్రం, స్టిక్కర్లు విడుదల చేశారు.
సినిమా స్క్రీనింగ్ కు ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొంటారని తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబరు 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించనున్నామని వెల్లడించారు.
సెప్టెంబర్ 12 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి ప్రజలలో చైతన్యం కల్పిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 13న రాష్ట్రవ్యాప్తంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని రామచందర్ రావు పిలుపిచ్చారు. సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన యోధుల చరిత్ర స్థలాలను సందర్శించాలని సూచించారు.
సెప్టెంబర్ 14, 16 తేదీల్లో రాష్ట్రస్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి రజకార్ల అకృత్యాల గురించి, పోరాట యోధుల గురించి ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తోంది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరుకానున్నారు.
కాగా, బిజెపి జిల్లా అధ్యక్షులు ప్రతి జిల్లాలో జాతీయ జెండా ఎగురవేయాలని ఆదేశించారు. 1948 సెప్టెంబర్ 17న ‘ఆపరేషన్ పోలో’ పేరిట సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ధైర్యపూర్వక చర్యలతో భారత సైన్యం నిజాం పాలనను ఓడించి, హైదరాబాద్ ప్రజలకు విముక్తి కల్పించారని ఆయన చెప్పారు. తెలంగాణకు స్వాతంత్ర్యం లభించిన సెప్టెంబర్ 17న ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వకుండా, నేటి తరానికి తెలియకుండా తొక్కిపెట్టడం అన్యాయం అంటూ రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజాం పాలనను ఎదుర్కొని పోరాటం చేసిన యోధుల త్యాగాలు, చరిత్ర నేటి తరానికి తెలియాల్సినదే. అందుకే, సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని బిజెపి నిరంతరం డిమాండ్ చేస్తోందని ఆయన తెలిపారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన వెంటనే, సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించే ఫైలుపై సంతకం చేసి దీన్ని ఖరారు చేస్తామని అయన హామీ ఇచ్చారు.

More Stories
తెలుగు రాష్ట్రాల జలవివాదాలు పరిష్కారంకు కేంద్రం ఫార్ములా!
వరంగల్ జంట హత్యల కేసులో మరణ శిక్ష
హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం 50 శాతం, మూసీకి రూ. 3,975 కోట్లు