హైదరాబాద్‌లో రూ. 2 కోట్ల రద్దైన పాత కరెన్సీ నోట్లు స్వాధీనం

హైదరాబాద్‌లో రూ. 2 కోట్ల రద్దైన పాత కరెన్సీ నోట్లు స్వాధీనం

హైదరాబాద్‌లో మళ్లీ రద్దయిన పెద్ద నోట్లు వెలుగులోకి వచ్చాయి. నారాయణగూడ శాంతి థియేటర్ ఎదుట కెనరా బ్యాంక్ సమీపంలో ఇద్దరిని, వాటర్‌ వర్క్స్‌ కార్యాలయం వద్ద మరో ఇద్దరిని ఈస్ట్‌ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మూడు బ్యాగుల్లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు రూ.2 కోట్ల విలువైన రద్దయిన రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 

అనంతరం ఈ నలుగురిని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. 2016 నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన రద్దైన నోట్లు పూర్తిగా సర్క్యులేషన్ నుంచి తొలగించబడాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయినప్పటికీ కొన్ని చోట్ల ఇప్పటికీ ఈ నోట్లు అప్పుడప్పుడు బయట పడుతున్నాయి. ఆర్బిఐ విధానాల ప్రకారం రద్దయిన నోట్లను చట్టబద్ధంగా మార్చుకునే గడువు చాలా కాలం క్రితమే ముగిసింది. 

అయినప్పటికీ పాత కరెన్సీని అక్రమ మార్గాల్లో ఉపయోగించడానికి ప్రయత్నాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆర్బిఐ తన వార్షిక నివేదికలో 2016లో నోట్ల రద్దుకు సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం చలామణిలో ఉన్న పాత రూ. 500, రూ. 1,000 నోట్లలో 99.3 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయి. దీని విలువ సుమారు రూ. 15.31 లక్షల కోట్లు. అంటే,  కేవలం రూ. 10,720 కోట్ల విలువైన నోట్లు మాత్రమే తిరిగి రాలేదు.

ఇక 2023లో చలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ. 2,000 నోట్లలో  98 శాతం నోట్లు ఇప్పటికే తిరిగి వచ్చాయని  ఆర్బిఐ తెలిపింది. 2023 మే 19 నాటికి చలామణిలో ఉన్న మొత్తం రూ. 3.56 లక్షల కోట్ల రూ. 2,000 నోట్లలో, 2025 ఫిబ్రవరి చివరి నాటికి కేవలం రూ. 6,471 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని ఆర్బిఐ నివేదించింది. 

పెద్ద మొత్తంలో రద్దయిన కరెన్సీ దొరకడం అనేది ఇప్పటికీ నల్లధన సమస్య పూర్తిగా తగ్గలేదనే సంకేతంగా చెప్పుకోవచ్చు. మరోవైప పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ కేసులో అరెస్టయిన వారిని విచారించి, వాటిని ఎక్కడి నుంచి సేకరించారన్న దానిపై లోతైన దర్యాప్తు కొనసాగించనున్నారు.