
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశంపై దర్యాప్తు చేపట్టడంలో సీబీఐ తొలి అడుగు వేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్, కోఠిలోని సీబీఐ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కాళేశ్వరం అధికారులతో పలు అంశాలపై చర్చించడంతో పాటు, కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టు సంబంధించిన నివేదికపై ఆరా తీసినట్లు సమాచారం.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డిఎస్ఏ) రిపోర్ట్ ఆధారంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన కాళేశ్వరం నివేదికపై సీబీఐ విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం కార్పొరేషన్., అంతరాష్ట్ర అంశాలపై విచారించాలని ప్రతిపాదనలు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంపై విచారించాలని లేఖలో ప్రస్తావించింది. కాళేశ్వరంలో భారీగా అవకతవకలు జరిగాయని, ప్రాజెక్టుల డిజైన్, నాణ్యత లోపాల వల్లే నిర్మాణ వైఫల్యమని ఎన్డిఎస్ఏ రిపోర్టు ఇచ్చిందని ప్రభుత్వం తెలిపింది.
ప్రజాప్రతినిధులతో పాటు ప్రాజెక్టులలో భాగస్వాములైన కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రైవేట్ కంపెనీలపై విచారణ జరపాలని సిబిఐకి రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై విచారణను రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తూ లేఖ రాసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ రావడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే, రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా సెప్టెంబర్ 1న సీబీఐ డైరెక్టర్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పంపారు. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిర్వహించిన జస్టిస్ చంద్ర ఘోష్ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై (కేసీఆర్, హరీష్ రావు) చర్యలు తీసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. జస్టిస్ ఘోష్ నివేదికను సీబీఐకి అప్పగించరాదని పేర్కొంది. అదే సమయంలో ఎన్డిఎస్ఏ, ఇతర నివేదికలను విశ్వసించవచ్చని పేర్కొనడం గమనార్హం.
More Stories
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి
హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు.
రాంచందర్ రావు కార్యవర్గంలో 8 మంది ఉపాధ్యక్షులు