
తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అధికారికంగా జరగాలంటే 2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాల్సిందే అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు స్పష్టం చేశారు. అది జరిగితీరుతుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా విముక్తి దినోత్సవంగా జరుపుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
కానీ సంతుష్టీకరణ రాజకీయాల కారణంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు, తర్వాత టీఆర్ఎస్–కాంగ్రెస్ ప్రభుత్వాలు వెనకడుగు వేశాయని మండిపడ్డారు. నిజాం నిరంకుశత్వ పాలనలో నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో 26 మందిని రజాకార్లు దారుణంగా హతమార్చి బావిలో పడేసిన ఘటన మనకు మరిచిపోలేని విషాద ఘట్టం అని పేర్కొంటూ ఆ గ్రామంలో సోమవారం ఆ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు.
తెలంగాణ ఉద్యమం సందర్భంగా విమోచనాదినాన్ని తమ ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందని ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ముస్లిం ఓటుబ్యాంక్ కోసం వెనుకంజ వేశారని ఆయన ధ్వజమెత్తారు. రజాకార్ కాసిం రజ్వి ప్రారంభించిన ఎంఐఎం నాయకులకు భయపడి కాంగ్రెస్, బిఆర్ఎస్ విమోచనాదినాన్ని అధికారికంగా జరపలేక పోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినోత్సవంగా జరపాలనే డిమాండ్ మొదట బిజెపి నేత సీహెచ్. విద్యాసాగర్ రావు లేవనెత్తారని గుర్తు చేస్తూ ఆనాడు ఆయన సూచనతోనే అన్ని పార్టీ పార్టీలు నేడు తమ కార్యాలయాల్లో మూడు రంగుల జెండా ఎగురవేసి “జనగణమన” పాడుతున్నారని చెప్పారు. నిజాం వ్యతిరేక పోరాటంలో భైరాన్పల్లి బురుజు, పరకాల అమరధామం, నిజామాబాద్ జైలు, నిర్మల్ సహా అనేక ప్రదేశాలు కీలక ఘట్టాలకు సాక్ష్యాలుగా నిలిచాయని రామచందర్ రావు వివరించారు.విమోచన దినోత్సవ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మజ్లిస్ భయంతో చేయలేకపోతున్నదని ఆయన మండిపడ్డారు. ఖాసీం రజ్వీ, రజాకార్ల వారసులకు కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీలు కవలపిల్లలవంటివని ధ్వజమెత్తారు. నిజాం పాలనలో జరిగిన అకృత్యాలు మరువలేనివని పేర్కొంటూ రజాకార్లు గుండ్రాంపల్లిపై దాడి చేసి ప్రజలను నీరు లేని బావిలో పడేసి సామూహిక దహనం చేశారని తెలిపారు.
తెలంగాణ మహిళలను వివస్త్రాలను చేసి బతుకమ్మ ఆడించారని, ఆడబిడ్డలపై అత్యాచారాలు జరిగాయని, ఒకేరోజు 96 మందిని హతమార్చారని వివరించారు. తెలంగాణ సంపదను దోచుకున్నది బీఆర్ఎస్ అని స్వయంగా కేసీఆర్ కుటుంబ సభ్యురాలే చెబుతున్నారని అంటూ పరోక్షంగా కవిత ఆరోపణలను రావు గుర్తు చేశారు. తెలంగాణ సొమ్మును దోచుకున్న డబ్బును సరిగ్గా పంచుకోలేకపోవడంతో ఈరోజు ఆ కుటుంబంలో గొడవలు అవుతున్నాయని ఎద్దేవా చేశారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత