సికింద్రాబాద్‌- తిరుపతి వందేభారత్‌ ఇక 20 కోచ్‌లు

సికింద్రాబాద్‌- తిరుపతి వందేభారత్‌ ఇక 20 కోచ్‌లు

వందే భారత్‌కు లభిస్తున్న ఆదరణ నేపథ్యంలో  సికింద్రాబాద్‌ – తిరుపతి సహా 7 మార్గాల్లో నడిచే వందే భారత్‌ రైళ్ల కోచ్‌ల సంఖ్యను పెంచాలని రైల్వే బోర్డు  నిర్ణయించింది. సికింద్రాబాద్‌- తిరుపతి, మంగళూరు సెంట్రల్‌- తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్‌-తిరునల్వేలి, మదురై-బెంగళూరు కంటోన్మెంట్‌, దేవ్‌గఢ్‌-వారణాసి, హవ్‌డా-రౌర్కెలా, ఇందౌర్‌-నాగ్‌పుర్‌ మధ్య నడిచే వందే భారత్‌ రైళ్లలో మరికొన్ని కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి.

ప్రస్తుతం ఈ 3 మార్గాల్లో 16 కోచ్‌లు, 4 రూట్‌లలో 8 కోచ్‌ల వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. 16 కోచ్‌ల రైలును 20 కోచ్‌లతో, 8 కోచ్‌ల రైళ్ల స్థానంలో 16 కోచ్‌లకు అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (జులై 31, 2025 నాటికి) వందేభారత్‌ రైళ్ల రద్దీ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని వీటిని అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు.

సికింద్రాబాద్‌- తిరుపతి సహా మంగళూరు సెంట్రల్‌- తిరువనంతపురం, చెన్నై ఎగ్మోర్‌-తిరునల్వేలి మార్గాల్లో ప్రస్తుతం 16 కోచ్‌ల వందేభారత్‌ నడుస్తుండగా దీనిని 20 కోచ్‌లకు పెంచనున్నారు. మిగతా 4 మార్గాల్లో 8 కోచ్‌ల రైళ్లు నడుస్తుండగా వాటి స్థానంలో 16 కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఈ 7 మార్గాల్లో కోచ్‌ల అప్‌గ్రేడ్‌తోపాటు మరిన్ని 20 కోచ్‌ల వందేభారత్‌ రైళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. 

కొత్తగా వచ్చే 16, 8 కోచ్‌ల రైళ్లను కొత్త మార్గాల్లో ఉపయోగిస్తామని దిలిప్ కుమార్ వివరించారు. అలానే దక్షిణ మధ్య రైల్వే ఇటీవల సికింద్రాబాద్- విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌ల సంఖ్యను పెంచింది. ఈ రైళ్ల (20720,20708)లో ప్రస్తుతం 14 ఏసీ ఛైర్ కార్ కోచ్లు ఉండగా వాటి సంఖ్య 18కి పెంచారు.  రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్ల సంఖ్యలో ఎటువంటి మార్పు చేయలేదు. సికింద్రాబాద్-విశాఖపట్నం (20707) వందేభారత్ రైలు ఉదయం 5.05 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి విశాఖపట్నం నుంచి మధ్యాహ్నం 2.30కి బయలుదేరే రైలు (20708) రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్కు చేరుకుంటుంది.