
హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గంలో వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రూపంలో ఏర్పాటు చేసిన గణేశ విగ్రహం తీవ్ర వివాదానికి దారితీసింది. స్థానిక ఎమ్మెల్యే టి. రాజాసింగ్ ఈ విగ్రహంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది హిందూ మనోభావాలను గాయపరుస్తుందని ఆరోపించారు. విగ్రహాన్ని, మండపాన్ని తక్షణమే తొలగించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కోరడంతో వారు దానిని మార్చేశారు.
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా, గోషామహల్‌లోని హబీబ్‌నగర్‌లో తెలంగాణ ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ ఛైర్మన్, కాంగ్రెస్ నేత మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ఒక గణేశ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం “తెలంగాణ రైజింగ్” థీమ్‌తో రూపొందించబడింది, ఇందులో గణేశుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెటప్‌లో నలుపు ప్యాంట్, తెలుపు షర్ట్, ఆకుపచ్చ కండువాతో కనిపించారు.
ఈ డిజైన్ రేవంత్ రెడ్డి గతంలో చేపట్టిన పాదయాత్ర ఫొటో నుంచి ప్రేరణ ఈ విగ్రహం ఏర్పాటు చేసిన్నల్టు సాయి కుమార్ చెప్పారు. “గత 5-10 సంవత్సరాలుగా మేము సినిమా థీమ్‌లతో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి తెలంగాణ అభివృద్ధి, సీఎం రేవంత్ రెడ్డి విజన్‌ను చాటేందుకు ఈ డిజైన్ ఎంచుకున్నాం” అని తెలిపారు. విగ్రహం ద్వారా “తెలంగాణ పురోగతి” సందేశాన్ని అందించాలని తమ ఉద్దేశమని, గణేశుడి ఆశీస్సులతో రాష్ట్రం ముందుకు సాగాలని కోరుకుంటున్నామని చెప్పారు.
అయితే, ఈ విగ్రహం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో భక్తులు, స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక ఎక్స్ యూజర్, “పండుగలు భక్తి, ఐక్యతను తీసుకురావాలి, రాజకీయ కథనాలతో కాదు” అని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ విగ్రహాన్ని “హిందూ భావనలకు అవమానం”గా అభివర్ణించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కు రాసిన లేఖలో, “సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఆయన దేవుడు కాదు. గణేశ విగ్రహాన్ని ఆయన రూపంలో చిత్రీకరించడం హిందూ సమాజం మనోభావాలను గాయపరుస్తోంది” అని విమర్శించారు.
ఈ చర్య పండుగ, గణేశుడి పవిత్రతను కించపరుస్తోందని, మత విశ్వాసాలను గౌరవిస్తూ, సామాజిక సామరస్యం కోసం విగ్రహం, మండపాన్ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్ ఫిర్యాదు తర్వాత, పోలీసుల ఆదేశాల మేరకు బుధవారం సాయి కుమార్ వివాదాస్పద విగ్రహాన్ని తొలగించి, మరో గణేశ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక భక్తులు, హిందూ సంస్థలు కూడా ఈ చర్యను వ్యతిరేకిస్తూ, “గణేశ చవితి వంటి పవిత్ర పండుగను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం సరికాదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి