తెలంగాణ రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాల పరిస్థితుల నేపథ్యంలో కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడు రాంచందర్ రావుకు ఫోన్ చేసి వరద పరిస్థితులను తెలుసుకుని, భరోసా ఇచ్చారు. అవసరమైతే మరిన్ని సహాయక చర్యలకు వీలుగా అవసరమైన మేరకు సిబ్బందిని, సామాగ్రిని కేంద్రం నుంచి వెంటనే పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసా కల్పించారు
ఈ సందర్భంగా బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షులు, ఆపై నాయకులతో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి భారీ వర్షాల నేపథ్యంలో సహాయ చర్యల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయి అధ్యక్షులు, ఆపై నాయకులందరూ ప్రజలతో అందుబాటులో ఉండి, సహాయక చర్యల్లో బీజేపీ కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని తెలిపారు.
బూత్ వారీగా సహాయక చర్యలు చేపట్టి ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. వరద ప్రాంతాలకు సిబ్బంది చేరుకోలేని పరిస్థితుల్లో లోతట్టు ప్రాంత ప్రజలకు ఆహారం, తాగునీరు, రవాణా సౌకర్యం కల్పించాలని సూచించారు ప్రత్యేకంగా బిజెవైఎం కార్యకర్తలు, కార్పొరేటర్లు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు
బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, అవసరమైన సామాగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాల్లో నిబద్ధతతో ఉండాలని రాంచందర్ రావు గారు పిలుపునిచ్చారు.
మరోవైపు కేంద్రమంత్రులు జి. కిషన్ రెడ్డి , బండి సంజయ్ కుమార్ వరద పరిస్థితులపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో చర్చించి, వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరింపజేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. బాధితులను రక్షించేందుకు ప్రత్యేక వైమానిక దళ హెలికాప్టర్లు అవసరమని కేంద్ర మంత్రులు అభ్యర్థించగా, కేంద్రం సానుకూలంగా స్పందించి ప్రత్యేక హెలికాప్టర్లను పంపించినట్లు వివరించారు. ప్రస్తుతం హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు.
వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రక్రియలో ఎన్డీఆర్ఎఫ్ టీంలు నిమగ్నమై ఉన్నాయని తెలిపారు. ఇదే నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో విపత్తు సమయంలో ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి, సహాయక చర్యల్లో చురుకుగా పాల్గొనాలని కార్యకర్తలకు రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి