బీహార్ ఎన్నికల్లో బిజెపికి సానుకూల వాతావరణం

బీహార్ ఎన్నికల్లో బిజెపికి సానుకూల వాతావరణం
త్వరలో జరుగనున్న బీహార్ ఎన్నిక‌ల్లో బీజేపీకి సానుకూల వాతావ‌ర‌ణం ఉంద‌ని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి తెలిపారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్‌కు అస‌లు ఒక ఎజెండా లేదని చెబుతూ రాహుల్ గాంధీ ఎందుకు పాద‌యాత్ర చేస్తున్నారో కూడా కాంగ్రెస్ నాయ‌కుల‌కే తెలియ‌ద‌ని ధ్వజమెత్తారు. ఓట్లు లేవని, డబుల్ ఓట్లు ఉన్నాయని ఆయన విమర్శలు చేస్తున్నార‌ని, లేకుంటే ఓట్లు నమోదు చేసుకోవాలని, రెండు ఓట్లు ఉంటే తొలగిస్తారని హితవు చెప్పారు.
తనకు తాను ఆటం బాంబు పెడుతున్నార‌ని రాహుల్ ఫీల్ అవుతున్నార‌ని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో కూడా చాలామందికి రెండు ఓట్లు ఉన్నాయ‌ని, వారు ఏదో ఒకచోట ఉంచుకోవాల‌ని సూచించారు. తీవ్రమైన అవినీతి కారణంగా 30రోజులు జైల్లో ఉంటే పోస్టుకు రాజీనామా చేయాల్సిందేన‌ని, జైల్లో ఉండి కూడా రివ్యూ చేస్తారని అంబేద్కర్ కు తెలిసి ఉంటే అప్పుడే రాజ్యాంగంలో ఈ చట్టాన్ని పొందుపరిచేవారమ‌ని కిష‌న్‌రెడ్డి తెలిపారు.
ఐదేళ్ల‌కు పైగా జైలులో ఉండేలా శిక్ష పడినట్లయితే పార్టీలకతీతంగా ప్రధాని అయినా కేంద్ర మంత్రులు అయినా, ఎమ్మెల్యేలు అయినా పదవి పోతుందనే బిల్లు ప్రవేశ పెట్టామ‌ని ఆయన చెప్పారు.  తామెందుకు ఈ చట్టంతో వారిని అనవసరంగా జైల్లో వేస్తామ‌ని పేర్కొంటూ అవినీతికి భయపడే వారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎన్నికలు పెడితే ఆ పార్టీని ప్రజలే ఓడిస్తారని కిష‌న్‌రెడ్డి హెచ్చరించారు.

కాళేశ్వరం అంశంపై అధికార దుర్వినియోగం జరిగిందని కిష‌న్‌రెడ్డి విమర్శించారు. నిర్మాణంలో తప్పు చేశార‌ని అనేక టీవీ డిబేట్లలో పలువురు రిటైర్ ఇంజినీర్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రాజెక్టులో లోపాలను మాత్రమే డ్యామ్ సేఫ్టీ అధికారులు చెబుతారని, అంతేకానీ అవినీతి గురించి వారు చెప్పరని చెప్పారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విచారణ సీబీఐకి ఇవ్వాలని లేఖ రాసిందని, కానీ ఇప్పుడు మాట మార్చుకుంది కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి విమర్శించారు.