హెచ్‌సీఏ అక్రమాలపై దృష్టి సారించిన ఈడీ

హెచ్‌సీఏ అక్రమాలపై దృష్టి సారించిన ఈడీ
 
తొలినుండి అవినీతి, అక్రమాలు, వివాదాలకు కేంద్రంగా ఉంటూ వస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో జరిగిన అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దృష్టి సారించింది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను క్రికెట్ అభివృద్ధి కోసం కాకుండా సొంత పనులకు వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి. స్టేడియం టెండర్ల నుంచి మొదలుకుని టికెట్ల విక్రయం దాకా అన్నింటిలో గోల్‌మాల్‌ జరిగినట్లు బయటపడింది. 
 
గత 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి హెచ్‌సీఏకు రూ.800 కోట్లకుపైగా నిధులు వచ్చాయి. కోట్ల రూపాయలు ఉన్న హెచ్‌సీఏ అకౌంట్‌ను కూడా సొంత ప్రయోజనాలకు వాడారని ఆరోపణలు వచ్చాయి. 2022లో జస్టిస్ లావ్ నాగేశ్వర్ రావ్ విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ బాల్స్, స్టేడియం చైర్స్, జిమ్ పరికరాలు టెండర్లలలో కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్‌లో నిర్ధారణ అయ్యింది. ఈ వ్యవహారంపై గతంలోనే హెచ్‌సీఏ సభ్యులను ఈడీ విచారించింది.
 
హెచ్‌సీఏలోకి ప్రవేశించడానికి ఎవరెవరికి ఎంత ఇచ్చారో అన్న విషయాలన్నింటినీ ఈడీ తేల్చనుంది. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా టెండర్ల విషయంలోనూ సొంత వాళ్లకే ప్రయోజనాలు చేకూరేలా జగన్‌ వ్యవహరించినట్లు తేలింది. ఫుడ్ క్యాటరింగ్, స్టేడియం లో స్టాల్స్, టికెట్స్ కేటాయింపులోనూ తన వారికే కట్టబెట్టుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరోవైపు హెచ్‌సీఏలో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఈడీ గుర్తించింది. టెండర్లు లేకుండా అనుకూలమైన వారికే పనులు కేటాయించడంతో హెచ్‌సీఏ సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు ఈడీ గుర్తించింది. కొద్ది రోజుల క్రితమే హెచ్‌సీఏ మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అతడి భార్యను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. ఈ క్రమంలో రూ. 90 లక్షల క్విడ్ ప్రోకో జరిగినట్టు బయటపడింది. 

క్రికెట్ బాల్స్ టెండర్ల, జిమ్ సామాను టెండర్లు, స్టేడియం కుర్చీలు టెండర్‌లు తమకు కేటాయించినందుకు లక్షల రూపాయలు లంచం తీసుకున్నట్లు బయటపడింది. మాజీ హెచ్‌సీఏ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ భార్య పేరు మీద జేబీ జ్యువెలర్స్‌ ఖాతాలోకి లంచం డబ్బుల జమ అయినట్లు ఈడీ గుర్తించింది.

కాగా, హెచ్‌సీఏ అక్రమాల కేసులో జగన్ మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటె, శ్రీచక్ర క్రికెట్‌ క్లబ్‌ జనరల్‌ సెక్రటరీ రాజేందర్ ‌యాదవ్,‌ ఆయన భార్య శ్రీచక్ర క్రికెట్‌క్లబ్‌ అధ్యక్షురాలు కవితను ఈ నెల 9న సీఐడీ అరెస్ట్‌ చేసింది. వారిని ఆరో రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించడంతో సీఐడీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తోంది. అలాగే హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై సీఐడీ ఎఫ్ఐఆర్, నిందితుల రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా ఈసీఐఆర్‌ను ఈడీ నమోదు చేసింది.