 
                తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ ఫిష్ వెంకట్ (53) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వెంకట్ ప్రాణాలు కోల్పోయారు. 
కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్‌ను ఇటీవల కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. 
ఐసీయూలో మృత్యువుతో పోరాడుతూ వెంకట్ మృతి చెందారు.  వెంకట్ అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. ఆయన స్వస్థలం మచిలీపట్నం.  ఆయన హైదరాబాద్ ముషీరాబాద్ మార్కెట్‌లో చేపల వ్యాపారం చేసేవారు. దీంతో ఫిష్ వెంకట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.  అదే ఏరియాలో నివాసం ఉంటున్న వెంకట్, నటుడు శ్రీహరి ద్వారా ఇండస్ట్రీలో వచ్చారు. తొలుత ఫిష్ వెంకటేశ్‌గా పిలిచేవారు. నటుడు అయ్యాక ఆయన పేరు ఫిష్ వెంకట్‌గా మారింది. 
ఫిష్ వెంకట్ తెలంగాణ యాసలో మాట్లాడే ప్రత్యేక శైలి, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 1991లో నిర్మించిన జంతర్ మంతర్ చిత్రంలో వెంకట్‌కు తొలిసారి నటించే అవకాశం వచ్చింది.  అయితే అప్పట్లో పెద్దగా గుర్తింపు రాకపోయిప్పటికీ నటనపై ఆసక్తితో అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే 2002లో ఎన్టీఆర్ హీరోగా వీవీ వినాయక్ తీసిన ‘ఆది’ సినిమాతో వెంకట్‌కు గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంతోనే సినీ పరిశ్రమలో నిలుదొక్కుకున్నట్లు గతంలో వెంకట్ పేర్కొన్నారు. 
ఖుషి, ఆది, బన్నీ, అదుర్స్, గబ్బర్ సింగ్, డీజే టిల్లు వంటి 100కు పైగా చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను అలరించారు. కామెడీ పాత్రలతో పాటు, విలన్ పాత్రల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఫిష్ వెంకట్ భార్య సువర్ణ, కుమార్తె స్రవంతితో కలిసి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.
                            
                        
	                    




More Stories
మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ లో దేశీయ తొలి ప్రైవేట్ రాకెట్
అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై బీజేపీ ఫిర్యాదు