రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా

రాజాసింగ్ రాజీనామా ఆమోదించిన జేపీ నడ్డా
 
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఇటీవల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రాజాసింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా. బీజేపీలో రెబల్ ఎమ్మెల్యేగా ముద్రపడ్డ రాజాసింగ్ గత కొద్దిరోజులుగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.  ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల సమయంలో నామినేషన్ వేసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన తనను కొందరు అడ్డుకున్నారని, దీంతో పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 
ఆ రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్లు తెలిపారు.  బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌ రావు నియమకంపై రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రామచందర్‌రావు బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే గోషామహల్ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు గత నెల 30న కిషన్ రెడ్డికి లేఖ రాశారు. దాదాపు 15 రోజుల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం దీనిపై దృష్టి సారించింది. 
 
అందులో భాగంగా రాజాసింగ్ రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదం తెలిపినట్లు లేఖను విడుదల చేసింది. అలాగే ఈ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు బీజేపీ జాతీయ అధ్యక్షులు. ఇటీవల రాజాసింగ్ ప్రస్తావించిన విషయాలు అసంబద్ధమని, పార్టీ పనితీరు, భావజాలం, సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ జేపీ నడ్డా లేఖలో పేర్కొన్నారు.