* రెండేళ్లలో హెచ్‌సిఎలో రూ.170 కోట్ల రూపాయల గోల్‌మాల్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన అక్రమాల కేసులో అధ్యక్షుడు జగన్మోహన్‌రావుతో సహా మరో నలుగురు నిందితులకు మల్కాజ్‌గిరి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అంతకుముందు జగన్మోహన్‌రావు అరెస్టుకు సంబంధించి సీఐడీ కీలక వివరాలు వెల్లడించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో (హెచ్‌సిఎ) రెండేళ్లలో రూ.170 కోట్ల రూపాయల గోల్‌మాల్ జరిగినట్లు సిఐడి గుర్తించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)తో టికెట్ల వివాదం నేపథ్యంలో సిఐడి దర్యాప్తు జరుపుతున్న క్రమంలో భారీగా ఆర్థిక అక్రమాలు వెలుగుచూశాయి. హెచ్‌సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం సహా ఫోర్జరీ సంతకంపై ఆయనను అరెస్టు చేసినట్లు తెలిపింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్‌తో కలిసి గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు, మాజీ మంత్రి కృష్ణయాదవ్ సంతకాన్ని జగన్మోహన్‌రావు ఫోర్జరీ చేసినట్టు సీఐడీ గుర్తించింది.
ఫోర్జరీ పత్రాలను జగన్మోహన్‌రావుకు కవిత అందించగా ఆ నకిలీ పత్రాలతోనే హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు ఎన్నికైనట్టు సీఐడీ విచారణలో తేలింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు అసలు కారకులపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు హెచ్‌సీఏలో అక్రమాలు, నిధుల దుర్వినియోగంపై టీసీఏ అధ్యక్షుడు గురువారెడ్డి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసిన సీఐడీ దర్యాప్తు చేపట్టింది.
జగన్మోహన్‌రావు, కోశాధికారి శ్రీనివాస్‌రావు, సీఈవో సునీల్, శ్రీచక్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షురాలు కవిత ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్‌పై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నట్టు సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా తెలిపారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్ హెచ్) నుంచి కాంప్లిమెంటరీ పాస్‌లను సైతం తీసుకొని బ్లాక్‌లో అమ్ముకొని నిందితులు సొమ్ము చేసుకున్నట్టు గుర్తించింది.
హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహనరావుపై గతంలో ఎస్‌ఆర్‌హెచ్ పలుమార్లు సంచలన ఆరోపణలు చేసింది. ఆ దరిమిలా తెలంగాణ రాష్ట్ర సర్కారు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచైజీపై హెచ్‌సీఏ అధ్యక్షుడు తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు విజిలెన్స్ విచారణలో అధికారులు నిర్ధరించారు. ఆ రిపోర్టు ఆధారంగా నేర పరిశోధన విభాగం కేసు నమోదు చేసింది.
గతంలో క్రికెట్ మ్యాచ్‌లు జరుగే క్రమంలో ఉప్పల్ స్టేడియంలో కాంప్లిమెంటరీ టికెట్లపై హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఇంతకుముందులా అన్ని కేటగిరిల్లో పాసులు కేటాయించాలని హెచ్‌సీఏ సన్‌రైజర్స్ ఫ్రాంచైజీని కోరింది. ఎస్‌ఆర్‌హెచ్ సీఈవో షణ్ముగంతో ఫోన్‌లో మాట్లాడిన హెచ్‌సీఏ ప్రతినిధులు తమ నిర్ణయాలను తెలిపారు. హెచ్‌సీఏకు కేటాయించే టికెట్లు యథావిధిగా కొనసాగించేటట్లు చూస్తామని అప్పుడే షణ్ముగం తెలిపారు.
More Stories
స్వదేశీ, స్వావలంబన దిశగా స్వదేశీ జాగరణ్ మంచ్
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!