అమెరికాలో మస్క్‌ కొత్త రాజకీయ పార్టీ

అమెరికాలో మస్క్‌ కొత్త రాజకీయ పార్టీ
 

టెక్ దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. తాను అమెరికా పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశానని ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశం ప్రస్తుతం ఒకే పార్టీ పాలనలో ఉందని విమర్శించిన మస్క్, ప్రజలకు తిరిగి స్వేచ్ఛను అందించాలన్న సంకల్పంతో ఈ నూతన రాజకీయ వేదికను ప్రారంభించినట్లు వెల్లడించారు.

ట్రంప్‌ కలల బిల్లు అయిన ‘వన్‌ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు’ను ఆమోదించిన మరుక్షణమే తాను రాజకీయ పార్టీని ఏర్పాట్లు చేస్తానని మస్క్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. బిగ్‌ బ్యూటీఫుల్‌ బిల్లును అమెరికా ఉభయ సభలు ఆమోదించడం, ట్రంప్‌ ఆ బిల్లుపై సంతకం చేయడం, అది చట్టం రూపం దాల్చడం జరిగిపోయాయి. దీంతో ‘ది అమెరికా పార్టీ’ ని  ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే ఈ పార్టీ ఎక్కడ రిజిస్టర్ అయ్యింది అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద ఇప్పటివరకు దీని పేరు నమోదు కాలేదని తెలుస్తోంది. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జులై 4వ తేదీ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై మస్క్ ఎక్స్​లో పోస్టు పెట్టారు. 

రెండు పార్టీల ఆధిపత్యం నుంచి విముక్తి కావాలా? అని మస్క్ ఎక్స్ ద్వారా పోలింగ్ నిర్వహించగా 12 లక్షలకుపైగా మంది స్పందించారు. ఇందులో మెజార్టీ మంది అవును అని స్పందించడంతో అమెరికా పార్టీని మస్క్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ “మీరు 2:1 నిష్పత్తిలో కొత్త పార్టీని కోరారు. ఈ పార్టీ మీకే అంకితం! ఇది అధిక ఖర్చులు, అవినీతితో దేశాన్ని అప్పుల్లో నెట్టేసే ఒకే పార్టీ పాలన. ఇది ప్రజాస్వామ్యం కాదు” అని మస్క్ మండిపడ్డారు.

మస్క్ పార్టీ ప్రధానంగా అమెరికా కాంగ్రెస్‌లోని 2 లేదా 3 సెనెట్ సీట్లు, 8 నుంచి 10 నియోజకవర్గాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. చట్టాలు ఆమోదించడంలో కీలకంగా మారడానికి అమెరికా కాంగ్రెస్​లో ఈ నంబర్ సరిపోతుంది. అందుకే మస్క్ మొదట అధికారం కోసం కాకుండా వ్యూహాత్మకంగా సెలక్టివ్​గా ముందుకు పోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

దీని వల్ల ప్రజల నిజమైన అభిమతాన్ని ప్రతిబింబించే విధానాలు అమలులోకి వస్తాయని మస్క్ భావిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్​నకు టెస్లా అధినేత మస్క్​ గట్టి మద్దతు ఇచ్చారు. ట్రంప్ గెలుపులో అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందించారు. ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి భారీ విరాళాలను అందించారు. 

280 మిలియన్ డాలర్లకు పైగా విరాళాలు అందించగా, వాటిలో మెజారిటీ డొనాల్డ్ ట్రంప్‌కు, మిగతా భాగం ఇతర రిపబ్లికన్ అభ్యర్థులకు ఇచ్చారు. దీంతో ట్రంప్ కు మస్క్ మరింత దగ్గరయ్యారు. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. ఈ క్రమంలో ఎంతో కీలకమైన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషెన్సీ (డీఓజీఈ) నాయకత్వ బాధ్యతలను మస్క్​కు ట్రంప్ అప్పగించారు. 

అయితే ఈ స్నేహం ఎక్కువకాలం నిలవలేదు. మూణ్నాళ్ల ముచ్చటగానే నిలిచిపోయింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్ఫర్థలు రావడంతో డీఓజీఈ బాధ్యతల నుంచి మస్క్ తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన బిగ్, బ్యూటిఫుల్ బిల్లుపై కూడా మస్క్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు ద్వారా అమెరికా రుణం రికార్డు స్థాయిలో ఐదు ట్రిలియన్ డాలర్ల వరకు పెరుగుతుందని తప్పుబట్టారు. 

ఇదే సందర్భంలో ట్రంప్ కూడా మస్క్‌కు కౌంటర్‌ ఇచ్చారు. మస్క్‌ను అమెరికా నుంచి పంపించివేయాల్సి వస్తుందని, ఆయన తన కంపెనీలను మూసుకొని దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి వస్తుందన్న స్థాయిలో హెచ్చరించారు. మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించిచారు. 2002లో అమెరికా పౌరసత్వం పొందారు.