హత్యాయత్నం కేసులో గుజరాత్‌ ఆప్‌ ఎమ్మెల్యే అరెస్ట్

హత్యాయత్నం కేసులో గుజరాత్‌ ఆప్‌ ఎమ్మెల్యే అరెస్ట్

హత్యాయత్నం కేసులో గుజరాత్‌ ఆప్‌ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం ప్రకటించారు. పంచాయితీ కార్యకర్తపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆప్‌ ఎమ్మెల్యే చైతర్‌ వాసవను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల ప్రకారం.. శనివారం రాత్రి వాసవ నియోజకవర్గం దేడియాపాడులో జరిగిన సమావేశంలో ఘర్షణ నెలకొంది. 

స్థానిక స్థాయి సమన్వయ కమిటీ ‘ఆప్నో తాలూకో వైబ్రంట్‌ తాలూకో (ఎటివిటి)లో నియామకం కోసం తన నామినీని నిర్లక్ష్యం చేశారంటూ ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. పంచాయితీ మహిళా ప్రెసిడెంట్‌ను దుర్భాషలాడటంతో పాటు పంచాయితీ అధ్యక్షుడిపై దాడికి దిగినట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదైనట్లు పోలీసులు తెలిపారు.  పంచాయితీ కార్యాలయం ఆస్తులను కూడా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.

సగ్బారా తాలూకా పంచాయతీ మహిళా అధ్యక్షురాలిని శ్రీ వాసవ దుర్భాషలాడడం ప్రారంభించారని ఆరోపణలు ఉన్నాయి. సమావేశంలో పాల్గొన్న దేడియాప్డా తాలూకా పంచాయతీ అధ్యక్షుడు సంజయ్ వాసవ అభ్యంతరం చెప్పినప్పుడు, ఎమ్మెల్యే ఆయనపై మొబైల్ ఫోన్ విసిరి దాడి చేశారని, దీనితో ఆయన తలపై గాయాలయ్యాయని సంజయ్ వాసవ ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
శాసనసభ్యుడు ఫిర్యాదుదారుడిపై గాజుతో దాడి చేయడానికి ప్రయత్నించాడు.  కానీ అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది ఆయనను అడ్డుకున్నారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే, గాజు పగిలిపోవడంతో, ఎమ్మెల్యే గాజు ముక్కలను తీసుకొని సంజయ్ వాసవ వైపు వెళ్లి చంపేస్తానని బెదిరించాడు. ఫిర్యాదుదారుడు ఏదో విధంగా తప్పించుకున్నాడని అందులో పేర్కొంది. ఎమ్మెల్యే కార్యాలయంలో ఉంచిన కుర్చీని ధ్వంసం చేశారని ఫిర్యాదులో ఆరోపించారు.  అయితే ముందుగా తనపై మొబైల్‌ ఫోన్‌ విసిరారని, తలకి గాయాలయ్యాయని, అనంతరం గాజు గ్లాస్‌తో కొట్టేందుకు యత్నించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఎమ్మెల్యే అరెస్ట్‌ను ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ ఖండించారు. విశావదర్‌ ఉప ఎన్నికలో ఆప్‌ ఇటీవల విజయం సాధించడంతో ఆప్‌ ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు. ఇది బిజెపి రాజకీయ ప్రతీకార దాడిగా అభివర్ణించారు. దాడులతో ఆప్‌ భయపెట్టాలని భావిస్తే అది తప్పని స్పష్టం చేశారు. బిజెపి గూండాయిజం, నియంతృత్వంతో ప్రజలు విసిగిపోయారని, ఇటువంటి వ్యూహాలకు వారే తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు.