భారీ విస్ఫోటంలో 45కు చేరిన మృతుల సంఖ్య

భారీ విస్ఫోటంలో 45కు చేరిన మృతుల సంఖ్య

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ కంపెనీలో సోమవారం జరిగిన భారీ పేలుడు పెను విషాదాన్ని మిగిల్చింది. తెలంగాణ చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 45మంది మరణించారు. వీటిలో ఆరు మృతదేహాలను గుర్తించారు. వివిధ దవాఖానల్లో మరో 31 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఇప్పటివరకు ఏడు మృతదేహాలను గుర్తించగా, మరో 20 గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. 

మృతులు, క్షతగాత్రులు బీహార్‌, ఒడిసా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వాసులుగా గుర్తించారు. అయిత మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాలను అధికారులు తొలగిస్తున్నారు.  ఘటనాస్థలిలో సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్‌ఎఫ్, హెడ్రా, రెవెన్యూ, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఘటనను తీవ్రంగా పరిగణించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి​ రామకృష్ణారావు నేతృత్వంలో సహాయక చర్యల పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీలో సభ్యులుగా డీఆర్​ఎఫ్​ స్పెషల్‌ సీఎస్​ , కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి, హెల్త్ సెక్రెటరీ, ఫైర్ సర్వీసెస్ అడిషనల్‌ డీజీలు వ్యవహరించనున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చేపట్టాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేయనుంది.

ఇలాంటి ఘటనలు జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై కమిటీ సిఫార్సు చేయనుంది. ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి అగ్నిప్రమాదం జరిగిన పరిశ్రమను  మంగళవారం పరిశీలించనున్నారు. పేలుడు జరిగినప్పుడు ఏకంగా 700 నుంచి 800 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అక్కడ పని చేస్తున్న వారిలో ఐదుగురు సజీవ దహనమవ్వడం మరింత బాధాకరం. 

ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ప్లింత్‌ బీమ్‌లు సైతం విరిగి, కుప్పకూలిపోవడంతో నష్ట తీవ్రత అనూహ్యంగా పెరిగింది. పరిశ్రమ వైస్‌ ప్రెసిడెంట్‌ ఇలంగోవన్‌ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు సంభవించింది. ఆ తీవ్రతకు ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం వరకు ఎగిరి పడిందంటే పరిస్థితి తీవ్రతను ఊహించవచ్చు.

మరణించిన పలువురు కార్మికుల మృతదేహాలు పూర్తిగా కాలిపోయి, గుర్తుపట్టలేని స్థితికి చేరుకోవడంతో వారిని గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలే మార్గమని వైద్యనిపుణులు స్పష్టం చేశారు.  మృతదేహాలకు పరీక్షలు కొనసాగుతున్నాయని, బాధిత కుటుంబ సభ్యులు, సంబంధిత అధికారుల సమక్షంలో రక్త నమూనా ఇవ్వాలని సూచించారు. ఆయా కుటుంబాలు డీఎన్ఏ పరీక్షలకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు. ప్రమాద బాధితుల వివరాల కోసం 08455276155ను సంప్రదించాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు.