బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు మావోస్టుల బెదిరింపులు

బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు మావోస్టుల బెదిరింపులు

బీజేపీ నాయకుడు, ఎంపీ రఘునందన్‌ రావుకు మరోసారి చంపుతామని మావోయిస్టుల నుండి ఆదివారం బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. ‘ఆపరేషన్‌ కగార్‌’ ఆపాలంటూ 2 వేర్వేరు నంబర్ల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌ చేశారు. ఏపీ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు 5 బృందాలు రంగంలోకి దిగాయన్నట్లుగా వారు తెలిపారు. తమ టీమ్‌లు హైదరాబాద్‌ నగరంలో ఉన్నాయని, మరికాసేపట్లో చంపేస్తామని హెచ్చరించారు. 

దమ్ముంటే కాపాడుకోవాలని రఘునందన్రావుకు సవాల్ విసిరారు. తమ ఫోన్లు ట్రేస్‌ చేసేందుకు యత్నిస్తున్నారని, తమ సమాచారం దొరకదని చెప్పారు. ఇంటర్నెట్‌ కాల్స్‌ వాడుతున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని మావోయిస్టులు కాల్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లుగా తెలిసింది.

అంతకు ముందు జూన్ 23న రఘనందన్రావుకు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో రాష్ట్ర డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఆర్మ్డ్ సిబ్బందితో పాటు ఎస్కార్ట్ వాహనంతో రక్షణ కల్పించారు. రెండు రోజుల క్రితం యశోద హాస్పిటల్లో చేరిన రఘనందన్ రావు కాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. 

ఈ క్రమంలోనే ఆయనకు మళ్లీ బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపింది. దీంతో రఘనందన్ రావు హాస్పిటల్ నుంచే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ వ్యవహారం పైన దృష్టి సారించాలని తనకు పదేపదే కాల్ చేసి బెదిరిస్తున్న టువంటి వ్యక్తులను పట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. రఘునందన్‌రావు బీజేపీ తరఫున రాష్ట్రంలో తీవ్ర విమర్శలు చేసే నేతగా పేరుపొందారు. 

ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ, కౌంటర్ ఎన్‌కౌంటర్లు, భద్రతా బలగాల తరఫున గట్టి పదజాలంతో మాట్లాడే ఆయనపై టార్గెట్ చేయడం వెనుక రాజకీయ ప్రేరణ ఉందా? లేదా ఇది కేవలం కేంద్ర మావోయిస్టుల వ్యూహంలో భాగమా? అన్నదానిపై భద్రతా శాఖలు ఆలోచిస్తున్నట్లు సమాచారం.