ఎస్​సీఓ సంయుక్త ప్రకటనకు రాజ్‌నాథ్‌ నిరాకరణ

ఎస్​సీఓ సంయుక్త ప్రకటనకు రాజ్‌నాథ్‌ నిరాకరణ
చైనాలోని కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సదస్సు తర్వాత విడుదల చేయాల్సిన సంయుక్త ప్రకటనలో పహల్గాం ప్రస్తావన లేకపోవటంతో దానిపై సంతకం చేసేందుకు నిరాకరించారు. దీంతో సంయుక్త ప్రకటనను ఎస్​సీఓ రద్దు చేయాల్సి వచ్చింది.

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొన్ని దేశాలు (పరోక్షంగా పాక్‌ను ఉద్దేశిస్తూ) సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా ఉపయోగిస్తున్నాయంటూ చైనా గడ్డనుంచే పాక్‌పై నిప్పులు చెరిగారు. తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.

గల్వాన్‌ లోయ ఘటన తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇందులో భారత్‌తోపాటు బెలారస్‌, చైనా, ఇరాన్‌, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌, పాకిస్థాన్‌, రష్యా, తజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌ సభ్య దేశాలుగా ఉన్నాయి. సదస్సు అనంతరం రూపొందించిన సంయుక్త ప్రకటన ఉగ్రవాదంపై భారత కఠినవైఖరిని ప్రతిబింబించలేకపోయింది. అంతేగాక ఎస్‌సీవో సదస్సుకు అధ్యక్షత వహించిన చైనా జమ్ముకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి ఘటనను ప్రస్తావించకుండా బలోచిస్థాన్‌ అంశాన్ని చేర్చి భారత్‌ను నిందించే ప్రయత్నం చేసింది.

దీంతో ఉగ్రవాదంపై భారత వైఖరిని నీరుగార్చేలా ఉన్న ఆ పత్రంపై సంతకం చేసేందుకు రాజ్‌నాథ్‌ సింగ్‌ నిరాకరించారు.  ఉగ్రవాద అంశంపై సదస్సులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంతో సదస్సు అనంతరం రక్షణ మంత్రుల సంయుక్త ప్రకటనను ఎస్‌సీవో రద్దు చేసింది. అంతకుముందు ఎస్‌సీవో సదస్సులో మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ కొన్నిదేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మారుచుకున్నాయని పాకిస్థాన్‌ పేరు ఎత్తకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు.

“మన ప్రాంతం శాంతి, భద్రత, అవిశ్వాసం అనే అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. రాడికలిజం, తీవ్రవాదం, ఉగ్రవాదం పెరగటమే సమస్యలకు మూల కారణం. ఉగ్రవాద గ్రూపుల చేతుల్లో విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉండకూడదు. ఈ సవాళ్లను ఎదుర్కోడానికి నిర్ణయాత్మకమైన చర్య అవసరం. మన భద్రత కోసం ఈ దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడాలి. అందుకోసం మనమంతా ఐక్యం ఉండాలి” అని పిలుపిచ్చారు. 

“తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకు తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉగ్రవాదం ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న దేశాలను విమర్శించడానికి ఎస్​సీఓ వెనుకాడకూడదు” అని రాజ్​నాథ్​ సింగ్ స్పష్టం చేశారు. ఈసందర్భంగా పహల్గాం ఉగ్రదాడి గురించి కూడా మాట్లాడుతూ దీనికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి కూడా వివరించారు.

పహల్గామ్ ఘటన భారత్​లో లష్కరే తోయిబా గతంలో చేసిన ఉగ్రవాద దాడులతో సరిపోలుతుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని సహించదు అనే విషయం తీసుకుంటున్న చర్యల ద్వారానే స్పష్టంగా కనిపిస్తోందని రాజ్​నాథ్​ సింగ్ పేర్కొన్నారు.  ఉగ్రవాదం నుంచి తమను తాము కాపాడుకునే హక్కు ఉందని చెబుతూ  ఉగ్రవాద శిబిరాలు ఎప్పటికీ సురక్షితం కాదని, వాటిని లక్ష్యం చేసుకునేందుకు వెనుకాడబోమని చూపించామని తెలిపారు. 

ఇక యువతలో రాడికలిజాన్ని వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి మనం కూడా చురుకైన చర్యలు తీసుకోవాలని రాజ్​నాథ్ సింగ్ సూచించారు. “ఎస్​సీఓలోని యాంత్రాంగం ఈ విషయలలో గణనీయమైన పాత్ర పోషించింది. భారత్​ అధ్యక్షత వహించిన సమయంలో ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదానికి దారితీసే రాడికలైజేషన్​ను ఎదుర్కోవడంపై ఎస్‌సీఓ దేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం మన ఉమ్మడి నిబద్ధతకు ప్రతీక” అని తెలిపారు.