హిందువులను అవమానిస్తారు.. ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారు

హిందువులను అవమానిస్తారు.. ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారు
హిందువులను అవమానిస్తారని, ప్రశ్నిస్తే సెక్యులరిజం అంటారని డీఎంకే నేతలపై ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తమిళనాడులోని మదురైలో హిందూ మున్నని, ఆర్‌వైస్ఎస్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మురుగన్‌ భక్తుల మహానాడులో ముఖ్యఅతిథిగా పాల్గొంటూ  హిందూమతాన్ని, హిందూ దేవుళ్లను విమర్శిస్తూ, హేళనగా మాట్లాడమే లౌకికవాదంగా ప్రకటించుకునే దుష్టశక్తులను పారదోలేందుకు హిందువులంతా సమైక్యంగా పోరాడాలని పిలుపిచ్చారు.
 
మతాన్ని రాజకీయాల కోసం ఉపయోగించడం సరికాదని, హిందుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవద్దని డీఎంకే నేతలకు హితవు చెప్పారు.   హిందూ దేవుళ్లను పనిగట్టుకుని విమర్శించే నాస్తికవాదులు అరేబియా నుంచి దేశంలోకి దిగుమతి అయిన మతాలను గానీ, ఆ మతాలకు చెందిన దేవుళ్లను గానీ విమర్శించగలరా? అని పవన్‌ నిలదీశారు. హిందువులు ఎప్పుడు సహనం పాటిస్తారని, ఆ సహనశీలురంతా ఒక్కటైతే నాస్తికవాదులంతా పత్తాలేకుండా పోతారని ఆయన హెచ్చరించారు.
 
ఈ సందర్భంగా తమిళ సామెత ‘సాధుమిరండాల్‌ కాడు కొల్లాదు’ (సజ్జనుడికి, సహనశీలికి ఆగ్రహం వస్తే అతడిని ఆపడం ఎవరి తరం కాదు)ను ఆయన ఉటంకించారు. హిందువులంతా ఏకమైతే నాస్తికవాదులు, దేవుళ్లను విమర్శించి అధికారంలోకి వచ్చినవారు (డీఎంకే పాలకులు) అడ్రస్‌ లేకుండా పోతారని స్పష్టం చేశారు. రాజ్యంగం భావప్రకటన స్వేచ్ఛ కల్పించింది కదా అని నాస్తికవాదులు రెచ్చిపోతూ హిందూ దేవుళ్లను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
 
మురుగన్‌ భక్తులు గానం చేసే స్కంధ షష్టి కవచాన్ని హేళన చేశారని పేర్కొంటూ ఆధ్యాత్మిక పునాదులను కదిపేందుకు ప్రయత్నిస్తున్న వారి కుటిల యత్నాలు ఎన్నటికీ ఫలించవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మురుగన్‌ భక్తులందరూ ఓ చూపు చూస్తే చాలు.. దేవుడిని తిట్టే వారంతా దేశం నుంచే పారిపోతారని స్పష్టం చేశారు. పరమ శివుడు మూడో కన్ను తెరిచిన పవిత్ర భూమి తమిళనాడే అని గుర్తు చేశారు. అలాంటి చోట ఆధ్మాత్మిక భావాలకు, ప్రత్యేకించి హిందువుల మత విశ్వాసాలకు భంగం కలిగిస్తే భక్తులు చూస్తూ ఊరుకోరని పవన్‌ హెచ్చరించారు. 

‘ఇల్లేమో దూరం, అంతటా గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, దారంతా మిట్టాపల్లాలు, అయినా మనసులో ధైర్యం ఉంది. అది చాలు’ అనే తెలుగు కవితకు అద్దం పట్టేలా తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి చెప్పినట్లు మురుగన్‌ భక్తులందరికీ ‘అచ్చమిల్లై… అచ్చమిల్లై’ (భయం లేదు.. భయం లేదు) అంటూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మతాచారాలపై దుమ్మెత్తి పోసేవారిపై సమైక్య ఉద్యమం చేపట్టేలా మహానాడులో తీర్మానం చేయాలని ఆయన కోరారు. 

నాగుపాము బుస కొడితేనే చిట్టెలుకలు పారిపోతాయని, ఆ రీతిలో పరమేశ్వరుడి మెడలోని నాగుపాము బుస కొడితే నాస్తికవాదులనే ఎలుకలు సైతం పత్తా లేకుండా పోతాయన్న తిరుక్కురళ్‌ సూక్తిని ఆయన తమిళంలో వినిపించారు.  మానాడును రాజకీయ లాభాల కోసం వాడుకోవడం తగదు. మా మతాన్ని  మీరెవరు ప్రశ్నించేది? అంటూ డీఎంకే నేతలను నిలదీశారు.

హిందువు హిందువుగా ఉండకూడదా? ప్రజల విశ్వాసాలను గౌరవించాలే తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా విమర్శించడం సరికాదని తెలిపారు. హిందూ సంస్కృతిని గౌరవించాలని, మతం పై రాజకీయాలేమీ జరగకూడదని స్పష్టం చేశారు. నండ్రి, వణక్కమ్‌ (ధన్యవాదాలు, నమస్కారం) అంటూ పవన్‌ ప్రసంగాన్ని ముగించారు. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.