ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతికి ప్రధాన కేంద్రంగా ఉన్న గుంటూరుకు వచ్చే రైళ్ల రాకపోకలు భవిష్యత్తులో పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రద్దీ పెరిగితే వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా పేరేచర్ల- మంగళగిరి మధ్య రైల్వేలైన్ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే నల్లపాడు నుంచి బీబీనగర్ వెళ్లే రెండు లైన్ల మార్గం క్రాసింగ్ వద్ద ఆర్‌వోఆర్ వంతెన నిర్మించాలని యోచిస్తున్నారు.
ఈ వంతెన కింది నుంచి, అదే విధంగా పైనుంచి రైళ్ల రాకపోకలు సాగిస్తాయి. ఇటువంటిది క్రాసింగ్ ఇటీవలే గూడూరు వద్ద నిర్మించారు. మొత్తం 35 కిలో మీటర్ల రైల్వేలైన్, వంతెన నిర్మాణానికి సుమారు రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఈనెల 13వ తేదీన గుంటూరులో అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ప్రాజెక్టు గురించి ప్రత్యేకంగా చర్చించారు.
మరోవంక, ప్రత్యేక సరకు రవాణా కారిడార్: మరోవైపు ప్రయాణికుల రైళ్లు తిరిగే మార్గాల్లోనే సరకు రవాణా సైతం చేస్తుండటంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేరేచర్ల- విజయవాడ వెళ్లే మార్గంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పేరేచర్ల నుంచి పొన్నెకల్లు మీదుగా మంగళగిరి వరకు ప్రత్యేక సరకు రవాణా నడవా ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
గుంతకల్ మార్గంలో నరసరావుపేట మీదుగా పేరేచర్ల నుంచి గుంటూరు వచ్చే సరకు రవాణా రైళ్లను కొత్త మార్గంలో మంగళగిరి వరకు నడపనున్నారు. అదేవిధంగా విజయవాడ వైపు నుంచి వచ్చే ట్రైన్లు మంగళగిరి నుంచి పేరేచర్ల వరకు నేరుగా వస్తాయి. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే పేరేచర్ల- నల్లపాడు-గుంటూరు- మంగళగిరి మధ్య రద్దీ తగ్గి, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అధికారుల భావిస్తున్నారు. తద్వారా సరకుల రైళ్లు అదనంగా నడపవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు సర్వే పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను రైల్వే బోర్డు మంజూరు చేసింది.
పేరేచర్ల- మంగళగిరి మధ్య కొత్త రైల్వే లైను నిర్మాణానికి సంబంధించిన సర్వే ప్రస్తుతం తుది దశలో ఉంది. అదే విధంగా ఆర్‌వోఆర్ వంతెన సర్వే పనులు పూర్తి కావస్తున్నాయి. సర్వేల ఆధారంగా ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు పరిశీలించిన తరువాత రైల్వే బోర్డు ఆమోదం కోసం పంపనున్నారు.
More Stories
ఏపీకి ముంచుకొస్తున్న ‘మొంథా’ తుపాను ముప్పు
ఈ దశాబ్దం మోదీదే… బీహార్ లో ఎన్డీయే విజయం
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?