జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత
బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఈ మేరకు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. 
 
మాగంటి గోపీనాథ్‌ 1963 జూన్‌ 2న హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో జన్మించారు. భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  మాగంటి గోపీనాథ్ 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు.  2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యవత అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగారు. 
 
తన సమీప మజ్లిస్‌ పార్టీ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌పై 9 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారే విజయాన్ని రుచిచూశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పీ విష్ణువర్ధన్‌రెడ్డిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్‌ నుంచే పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి అజారుద్దీన్‌పై గెలిచి హ్యాట్రిక్‌ సాధించారు. మాగంటి గోపీనాథ్ మరణం పట్ల బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణానికి చింతిస్తూ సంతాపం తెలిపారు. గోపీనాథ్‌ మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నాయకుడిగా తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు.