బీజాపూర్‌ లో ఐదుగురు మావోయిస్టులు మృతి

బీజాపూర్‌ లో ఐదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో గత కొన్ని రోజులుగా తుపాకుల మోత మోగుతోంది. ఆపరేషన్‌ కగార్‌లో భాగంగా యాంటీ నక్సల్‌ ఆపరేషన్‌ చేపట్టిన భద్రతా దళాలు.. కంటికి కనిపించిన మావోయిస్టులను కాల్చుకుంటూ పోతున్నాయి. ఇప్పటికే పలువురు అగ్రనేతలు ఎదురు కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం కూడా ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది.

బీజాపూర్ జిల్లాలోని నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనాస్థలిలో రెండు ఏకే 47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. బీజాపూర్‌ జిల్లాలోని నేషనల్‌ పార్క్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా రిజర్వ్‌ గార్డ్స్‌(డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(ఎస్‌టీఎఫ్‌) భద్రతా దళాలు గత నాలుగు రోజులుగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో గురు, శుక్రవారాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సుధాకర్‌, భాస్కర్‌ మరణించారు. భాస్కర్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 లక్షలు, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించగా, సుధాకర్‌ఫై రూ.40 లక్ష రివార్డు ఉన్నది. గత మూడు రోజులుగా నిరంతరం జరుగుతున్న ఆపరేషన్‌లో ఇప్పటివరకు ఏడుగురు నక్సలైట్లను బలగాలు మట్టుబెట్టాయి. వారిలో ఇద్దరు టాప్ కమాండర్లు ఉన్నారు. గత మూడు రోజుల్లో ఎదురుకాల్పుల్లో మరణించిన ఏడుగురిలో ఇద్దరిని గుర్తించగా మరో ఐదుగురి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నట్లు బీజాపూర్ జిల్లా ఎస్‌పి జితేంద్ర యాదవ్ తెలిపారు.

కాగా, ఛత్తీ్‌సగఢ్‌లో నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్‌లో చురుగ్గా వ్యవహరించిన పోలీస్‌ అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఛత్తీ్‌సగఢ్‌ సీఎం విష్ణు దేవ్‌ సాయ్‌, డిప్యూటీ సీఎం విజయ్‌ శర్మ, హోం మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్‌న్లను విజయవంతంగా నిర్వహించిన పోలీస్‌ అధికారులను అభినందించినట్లు అమిత్‌ షా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. ఆపరేషన్లు విజయవంతం కావడంలో పాలుపంచుకున్న పోలీసులను కూడా తాను కలుసుకోవాలనుకుంటున్నానని, త్వరలో ఛత్తీ్‌సగఢ్‌లో పర్యటిస్తానని చెప్పారు.