మావోయిస్టు మరో అగ్రనేత భాస్కర్ హతం

మావోయిస్టు మరో అగ్రనేత భాస్కర్ హతం

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీకి చెందిన సీనియర్‌ నేత నాయుడు సుధాకర్‌ మరణించిన 24 గంటల వ్యవధిలోనే మరో కీలక నేత మృతి చెందాడు. బీజాపూర్ జిల్లా, నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య గురువారం నుంచి భీకర పోరు కొనసాగిన విషయం తెలిసిందే. కూంబింగ్ కొనసాగింపు నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందాడు. 

ఘటనా స్థలంలో ఎకె -47 ఆయుధాన్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు చత్తీస్ గఢ్ పోలీసులు ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా, బోథ్ మండలం, ఉరుమడ్ల గ్రామానికి చెందిన భాస్కర్ 1995 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని అసలు పేరు మందుగుల భాస్కర్ రావు. ఆయన తండ్రి దుర్గయ్య సిపిఐ (మావోయిస్ట్) తెలంగాణ రాష్ట్ర కమిటీ మంచిర్యాల-కొమరం భీం (ఎంకెబి) డివిజన్ కార్యదర్శిగా పనిచేశారు. తాజాగా నేషనల్‌ పార్కు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టు అగ్ర కమాండర్లు మృతిచెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.

భాస్కర్ ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యునికి పనిచేస్తున్నారు. అతనిపై చత్తీస్‌గఢ్‌లో రూ.25 లక్షలు, తెలంగాణలో రూ.20 లక్షలు – మొత్తం 45 లక్షల రివార్డ్ ఉంది. అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర కమిటీ స్థాయికి భాస్కర్ ఎదిగారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల రిక్రూట్‌మెంట్‌లో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణాలో మావోయిస్ట్ పార్టీని బలోపేతం చేసేందుకు భాస్కర్ కీలకంగా పనిచేశారు. అయితే అతని యత్నాలను తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టారు.  ప్రస్తుతం భాస్కర్ వయసు 53 సంవత్సరాలు. పార్టీని బలోపేతం చేయడానికి, ఎక్కువ మంది విప్లవ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యేటట్లు కృషి చేశాడు.

ఆసిఫాబాద్‌, మంచిర్యాల జి ల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అడెల్లు 2020 జూన్‌లో ఆసిఫాబాద్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అటవీ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో పర్యటించి మావోయిస్టు పార్టీల్లో యువకులను చేర్చుకునేందుకు ప్రయత్నించారు. తిర్యాణి అటవీ ప్రాం తంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్‌ దళాలు, ఇతర ప్రత్యేక పోలీసుల బలగాలకు మూడుసార్లు ఎదురుపడి తృటిలో తప్పించుకున్నారు.

2020 సెప్టెంబర్‌లో ఆసిఫాబాద్‌ మండలం చిలాటిగూడ అటవీ ప్రాంతంలోని చేలల్లో పోలీసులకు తారసపడి తృటిలో త ప్పించుకుపోయారు. అప్పటి డీజీపీ మహేందర్‌ రెడ్డి జిల్లాలో ఆరు రోజుల పాటు మకాం వేసి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. దాదాపు మూడు నెలల పాటు గ్రే హౌండ్స్‌ దళాలు అడవులను జల్లెడ పట్టినప్పటికీ మావోయిస్టు నేత మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ పోలీసులకు చిక్కలేదు. 

ఈ ఘటనలు జరిగిన మూడు నెలలకు 2020 సెప్టెంబర్‌ 19న కాగజ్‌నగర్‌ ఈస్‌గాం పోలీస్టేషన్‌ పరిధిలోని కదంబా అడవుల్లో ఇద్దరు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.ఈ కాల్పుల్లో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు చెందిన మావోయిస్టు చుక్కాలు, ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌కు చెందిన జుగ్నాక బాజీరావు చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కూడా మైలారపు అడెల్లు చాకచక్యంగా తప్పించుకున్నట్లు పోలీసులు భావించారు.

కాగా, గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. అంతకుముందు గత నెల 21వ తేదీన జరిగిన మరో భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు మరణించారు. గడిచిన 17 రోజుల వ్యవధిలోనే ముగ్గురు ముఖ్యనేతలు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఘటనలు ఆ పార్టీకి భారీ నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. కాగా, నేషనల్ పార్కు సమీపంలో ఇతర మావోయిస్టు కార్యకర్తల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.