హైదరాబాద్ మెట్రో-2కు సత్వరం అనుమతి ఇవ్వండి

హైదరాబాద్ మెట్రో-2కు సత్వరం అనుమతి ఇవ్వండి
హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు కేంద్ర మంత్రివర్గం సత్వరం అనుమతులు ఇవ్వాలని, అనుమతులు ఇచ్చే లా పట్టణాభివృద్ధి శాఖను ఆదేశించాలని ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి, దక్షిణ భాగానికి ఒకేసారి ఆర్థిక, మంత్రివర్గ అనుమతులు ఇవ్వాలని ఆయన కోరారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం భూసేకరణకు 50శాతం ఖర్చును రాష్ట్ర ప్ర భుత్వం భరించేందుకు సిద్ధంగా ఉందని సిఎం రేవంత్‌రెడ్డి ప్రధానితో తెలిపారు. 
 
నీతి ఆయోగ్ సమావేశం అనంతరం శనివారం ముఖ్యమంత్రి ప్రధాని మోదీని కలిసి తెలంగాణకు సంబంధించిన పలు ప్రోజెక్టుల గురించి చర్చించారు. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంతో కలిపి ఏక కాలంలో చేపట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడున్న ఓఆర్‌ఆర్ రానున్న 5 సంవత్సరాల్లో సరిపోదని, ఇప్పటికే ఓఆర్‌ఆర్ పై రోజుకు లక్షకు పైగా వాహనాలు ప్రయాణిస్తున్నాయని సిఎం తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం పూర్తయిన తర్వాత దక్షిణ భాగం నిర్మాణం చేపడితే భూ సేకరణ, నిర్మాణ వ్యయం భారీగా పెరిగే ప్రమాదం ఉందని చెప్పారు. 

రీజినల్ రింగ్‌రోడ్డుకు సమాంతరంగా 370 కిమీ పరిధిలో రైల్వే లైన్ ప్రతిపాదించామని సిఎం రేవంత్ తెలిపారు. బందర్ పోర్టు నుంచి హైదరాబాద్ డ్రైపోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 35శాతం ఔషధాలను ఉత్పత్తి చేస్తోందని, బందరు పోర్ట్ – డ్రైపోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే సరుకు రవాణా ఖర్చు తగ్గించడంతో పాటు ఎగుమతులకు దన్నుగా నిలుస్తుందని చెప్పారు. తయారీ రంగానికి ప్రోత్సాహాకరంగా ఉండడంతో పాటు నూతన ఉద్యోగాలు సృష్టిస్తుందని పేర్కొన్నారు.
సెమీకండక్టర్ రంగానికి మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీకి సిఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం)కు తెలంగాణ పూర్తి మద్దతు ఇస్తోందని తెలిపారు. తెలంగాణ ఐఎస్‌ఎం ప్రాజెక్ట్‌కు కేంద్రం ఆమోదం తెలపాలని, దానివల్ల పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించి ఉద్యోగాలు సృష్టిస్తుందని, 2030 నాటికి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలో 500 బిలియన్ డాలర్లకు చేరుకోవాలన్న లక్ష్యానికి తోడ్పాటు అందిస్తుందని వివరించారు.రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ, -ప్రైవేటు సంయుక్త భాగస్వామ్యంలో, ఎంఎస్‌ఎంఈల్లో ఉన్న రక్షణ రంగ ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు.

 
కాగా, వికసిత్‌ భారత్‌ లక్ష్యంతో ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని నీతి ఆయోగ్ సమావేశంలో రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇందు  ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలుంటాయని పేర్కొన్నారు. 2047 నాటికి భారత్‌ను సూపర్‌ పవర్‌గా, నెంబర్‌ వన్‌గా నిలబెట్టాలన్న మోదీ సంకల్పాన్ని ఆయన స్వాగతించారు