
* 20 పడకలతో విమ్స్ లో కరోనా వార్డు.. కూకట్‌పల్లిలో డాక్టర్‌కు కరోనా
మూడేళ్ల కిందట ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మరో రూపాంతరం చెంది విజృంభిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైందని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు తెలిపారు. సరికొత్త వేరియంట్ జెఏన్ 1, ఎల్ ఎఫ్ 7, ఎన్ బి 1.8 ఆందోళన కలిగిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు విమ్స్ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేసినట్లు తెలిపారు.
నగరంలో ఒక కేసు నమోదు కావడంతో కరోనా వైద్య పరీక్షల నిమిత్తం రాపిడ్ కిట్లను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చామని తెలిపారు. రాపిడ్ కిట్ లో పాజిటివ్ అని వస్తే వెంటనే ఆర్టిపిసిఆర్ పరీక్షలకు పంపించి కరోనా నిర్ధారణ చేయనున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కరోనా రోగులకు వైద్యం అందించేందుకుగాను వైద్యులకు సిబ్బందికి పిపి కిట్లను రోగులకు అవసరమైన మందులను సమకూర్చుకోవడం జరిగిందని వివరించారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా విశాఖలో ఒక కరోనా కేసు మాత్రమే నమోదైందని వైద్యారోగ్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అలానే కరోనాపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళగిరి ఏపీఐసీసీ భవనంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో కరోనా, సీజనల్ వ్యాధులపై సమావేశం నిర్వహించారు. అలానే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. ప్రజలు కరోనాపై భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
కరోనాసోకిన వ్యక్తి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఇంటి వద్ద క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నాడని మంత్రి తెలిపారు. కరోనా సోకిన వ్యక్తి విదేశాలు పర్యటించలేదని, ఎలా కరోనా వచ్చిందనే అంశంపై ఆరా తీస్తున్నామని తెలిపారు. సమీక్షలో వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్, సెకండరీ హెల్త్ డైరక్టర్ డా. సిరి కూడా పాల్గొన్నారు.
మరోవంక, తాజాగా తెలంగాణలో కూడా కరోనా తొలి కేసు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న వైద్యుడికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన్ను క్వారంటైన్లో ఉంచినట్లు తెలుస్తోంది. కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ కీలక మార్గదర్శకాలు విడుదల చేశారు.
More Stories
జీఎస్టీ సంస్కరణలతో ఏపీ ఆరోగ్య రంగంలో రూ. 1,000 కోట్ల ఆదా
ఆలయాలు, టాయిలెట్లు ఒకటేనా షర్మిలా!
అంతర్వేది తీరంలో సముద్రం వెనుకంజ