రాహుల్ పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

రాహుల్ పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2018లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు గానూ పరువు నష్టం కేసులో జార్ఖండ్‌లోని చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్‌ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది.

2018 లో బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై రాహుల్‌ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఓ హ‌త్య కేసులో నిందితుడ‌ని రాహుల్ ఆరోపించారు. రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు అవమానించేలా, పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు ప్రతాప్ కటియార్ డిఫమేషన్‌ కేసు వేశారు. 

2018 జులై 9న చైబాసాలోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో కేసు దాఖలు చేశారు. అనంతరం జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును 2020 ఫిబ్రవరిలో రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. ఆ తర్వాత ఈ కేసు చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు చేరింది. అక్కడ ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న మెజిస్ట్రేట్‌ విచారణకు హాజరుకావాలంటూ రాహుల్‌కు పలుమార్లు సమన్లు జారీ చేశారు. 

అయితే కోర్టు సమన్లను రాహుల్‌ పదేపదే దాటవేస్తూ వచ్చారు. దీంతో కోర్టు మొదట బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఆ తర్వాత వారెంట్‌పై స్టే కోరుతూ రాహుల్‌ జార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఆ పిటిషన్‌ను మార్చి 20, 2024న కోర్టు కొట్టివేసింది. దీంతో రాహుల్‌ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. 

దీనిపై విచారణ జరిపిన చైబాసా కోర్టు పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ మేరకు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ మేరకు రాహుల్ జూన్ 26న స్వయంగా కోర్టు ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.